ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం ప్రస్తుతం రాష్ట్రంలోని చాలాచోట్ల ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్లు పెరుగుతున్నాయి. మొన్న నర్సాపూర్ ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని ఆ నియోజకవర్గంలోని ఓ వ్యక్తి కోరగా.. తాజాగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
కోహెడ గ్రామానికి చెందిన కంది సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేసతీష్ కుమార్ కు ఫోన్ చేసి మునుగోడులో ఎవరు గెలుస్తారని అడిగారు. మీరు కూడా రాజీనామా చేస్తే హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుందని కామెంట్ చేశాడు. మీ రాజీనామాతోనైనా ఇక్కడి రోడ్లు బాగుపడ్తయ్ అని వ్యాఖ్యానించాడు. స్పందించిన ఎమ్మెల్యే అభివృద్ధి ఎక్కడ జరగలేదో చెప్పాలని అతడిని అడగ్గా..సతీష్ రెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను వివరించాడు. అతడు మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే మంచిది అంటూ ఫోన్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.