కామారెడ్డి జిల్లా : ఇదో రకమైన మోసం. అమాయకులు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. టెక్నాలజీపై అవగాహన లేకపోవడం వల్ల కొందరు మోసపోతున్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవడం కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు కేటుగాళ్లు. డిఫెన్స్ కోటాలో రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తానంటూ ఓ వ్యక్తి మోసం చేశాడు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
అశోక్ నగర్ కు చెందిన రాజు అనే వ్యక్తి.. కామారెడ్డి నుంచి గుంతకల్లుకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ కు వెళ్లాడు. రాజును చూసిన విజయ్.. తన మాయమాటలతో తన బుట్టలో వేసుకున్నాడు. తాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్ శాఖలో ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. ఇదంతా నిజమేనని నమ్మిన రాజు.. టిక్కెట్లు గురించి అడిగాడు. ఇంకేముంది..డిఫెన్స్ కోటాలో.. టికెట్లు బుక్ చేస్తానంటూ రాజును బాగా నమ్మించాడు విజయ్. టిక్కెట్ల కోసం 3 వేల 500 రూపాయలు రాజు నుంచి వసూలు చేశాడు. 8 టికెట్ల (డూప్లికేట్)ను ఫోన్ లో బుక్ చేసి, వాటిని రాజు ఫోన్ కు పంపించాడు. అవే టికెట్లతో రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో రాజు కుటుంబ సభ్యులు వెళ్లారు. రైల్లో చెకింగ్ కు వచ్చిన రైల్వేశాఖ అధికారులు డూప్లికేట్ టిక్కెట్లను చూసి షాక్ అయ్యారు. వెంటనే రాజు కుటుంబ సభ్యులను రైలు నుంచి కిందకు దించేశారు. తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు బాధితులు.