ప్రాణం తీసిన గెట్టు పంచాయితీ.. ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి

  • కుటుంబాన్ని పరామర్శించి.. ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ

మేళ్లచెరువు (చింతలపాలెం),వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తగూడెం తండాలో భూ తగాదాలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన చింతలపాలెం ఎస్ఐపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్  విధించారు. మండలంలోని కొత్తగూడెం తండాలో ఇటీవల రెండు కుంటుంబాల మధ్య గెట్టు పంచాయితీ వచ్చింది. పరస్పరం ఘర్షణలు, దాడులు జరిగాయి. ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. 

ఈ దాడిలో గుగులోతు వాచ్యా (36) తలకు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి సీరియస్ కావడంతో బాధితుడిని మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్  గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ అతను బుధవారం చనిపోయాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ గ్రామాన్ని సందర్శించి గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చింతలపాలెం పీఎస్ లో ఘటనపై సమీక్షించారు. ఘటనకు కారకులైన 17 మందిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. 

మొత్తం ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ హరీశ్  రెడ్డిని ఎస్పీ ఆఫీసుకు అటాచ్  చేస్తున్నామని వెల్లడించారు. అలాగే డిపార్ట్ మెంట్ వైఫల్యాలపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో అలజడి రేపినా, కక్షపూరితంగా ప్రేరేపించినా చర్యలు తప్పవని ఎస్పీహెచ్చరించారు. పరిస్థితులు చక్కబడే వరకూ పోలీస్ పికెట్ అమల్లో ఉంటుందన్నారు.