
- తోటి డ్రైవర్లే హత్య చేసి పడేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మండలంలో ని కుమ్రంభీం ప్రాజెక్ట్ లో ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన పోల్కర్ సుధాకర్ (45) ఆటో డ్రైవర్ పనిచేస్తూ ఆటో పాయింట్ వద్ద సీరియల్ నంబర్ ప్రకారం ఆటోలను పంపించేవాడు. రెబ్బెన మండలం కైర్గం గ్రామానికి చెందిన తోటి ఆటో డ్రైవర్ చనిపోవడంతో శుక్రవారం ఆటో డ్రైవర్లంతా వెళ్లారు.
అక్కడి నుంచి అందరూ ఆసిఫాబాద్ వచ్చి వైన్స్‌లో లిక్కర్ తాగారు. అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయారు. సుధాకర్ మాత్రం రాత్రయినా ఇంటికి రాలేదు . దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శనివారం సుధాకర్ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం కొందరు మేకల కాపరులకు కుమ్రంభీం ప్రాజెక్టు వద్ద గుర్తుతెలియని శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లి చూడగా సుధాకర్ డెడ్‌బాడీ కనిపించింది. కాగా, సుధాకర్ ను తోటి ఆటో డ్రైవర్లే లిక్కర్ తాగించి తర్వాత హత్య చేశారని ఆరోపిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా రాస్తారోకో చేశారు. డెడ్‌బాడీపై కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ఉన్నాయని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. మృతుడికి భార్య సుజాత తో పాటు ముగ్గురు కూతుళ్లు శిల్ప, సిరి, సీమ ఉన్నారు.