ఈజీగా డబ్బులు సంపాదించేందుకు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. బుర్రలో మెదిలిన ఐడీయా తప్పు అని తెలిసినా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. కొందరు అర్ధరాత్రి వేళ దొంగతనాలు చేస్తే.. మరికొందరు పట్టపగలే తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని అందినకాడికి దోచుకుని వెళ్తుంటారు. ఇక్కడ మాత్రం ఓ దొంగ ఏకంగా సర్కారు ఆఫీసులో దొంగతనం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్ ఆఫీసులో జరిగింది.
పోలీసులు, రామచంద్రాపురం తహశీల్దార్ ఆఫీసు సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం.. పక్కా ప్లాన్ తో ఓ వ్యక్తి నీట్ గా టక్కు, తలపై క్యాప్ ధరించి రామచంద్రాపురం తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. వెళ్తు వెళ్తూ.. చేతిలో ఒక సంచిని కూడా తన వెంట తీసుకెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా చాలాసేపు తహశీల్దార్ ఆఫీసులో అటు ఇటు తిరిగాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఏదో పని మీద వచ్చి ఉంటాడని అనుకున్నారు. కానీ, అసలు విషయం ఎందుకు వచ్చాడో వారికి తెలియదు.
తహశీల్దార్ ఆఫీసులో ఎవరూ లేరని గ్రహించిన సదరు వ్యక్తి.. మెల్లగా లోపలికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న సంచిలో ల్యాప్ టాప్ ను వేసుకున్నాడు. అటు ఇటు చూస్తూ.. కంగారుగా బయటకు వెళ్లాడు. అయితే.. అక్కడే సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మరిచి చోరీ చేశాడు. తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఏమరపాటుగా ఉండటాన్ని గమనించిన దొంగ.. ల్యాప్ టాప్ ను దొంగతనం చేశాడని సీసీ కెమెరాలో నిక్షిప్తమైన విజువల్స్ బట్టి అర్థమవుతోంది. పట్టపగలే తహశీల్దార్ ఆఫీసులో దొంగతనం జరగడంపై స్థానికంగా అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ఆఫీసులో ల్యాప్ టాప్ కనిపించకపోయేసరికి సిబ్బంది కంగారు పడ్డారు. అంతటా వెతికారు. కానీ, ఎక్కడా దొరకపోవడంతో చివరకు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం తెలిసింది. ఆఫీసుకు వచ్చిన ఒక వ్యక్తే ల్యాప్ టాప్ ను దొంగతనం గుర్తించి.. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ల్యాప్ టాప్ దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమకు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు.