వల్లభిలో భయం..భయం

ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లా  ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద ఓ వ్యక్తికి లిఫ్ట్​ ఇవ్వగా అతడు వెనక నుంచి తొడపై ఇంజక్షన్​ వేసి ప్రాణాలు తీశాడు. ఈ ఘటనతో మండలంలోని ప్రజలు భయపడుతున్నారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్  తన కూతురిని ఏపీలోని గండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశాడు. సోమవారం తన బైక్​పై గండ్రాయి గ్రామానికి వెళ్తుండగా వల్లభి గ్రామం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆపాడు. తన బండిలో పెట్రోల్​అయిపోయిందని, బంక్ వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరడంతో జమాల్​తన బైక్​పై ఎక్కించుకున్నాడు. గ్రామ శివారులోకి వెళ్లగానే వెనక తమకు తెలిసిన వారి బండి వస్తుందని, ఆపాలని కోరాడు. బైక్​ను స్లో చేస్తుండగా వెంటనే జమాల్ సాహెబ్ కు తొంటిపై ఇంజక్షన్​పొడిచి వెనక వచ్చే బండి ఎక్కి పారిపోయాడు. ఏం జరుగుతుందో తెలియని జమాల్​అలాగే బండిని ముందుకు పోనిచ్చాడు. కొద్దిసేపటికే కండ్లు తిరుగుతున్నట్లు కావడం, ఒళ్లంతా చెమటలు పట్టడంతో బండి అపి కుప్పకూలిపోయాడు.  గమనించిన స్థానికులు జమాల్ సాహెబ్ ను పైకి లేపగా తొంటికి సిరంజి కనిపించింది. తను లిఫ్ట్​ఇచ్చిన వ్యక్తే ఇంజక్షన్ వేశాడని చెప్పి, తన ఇంటికి ఫోన్​చేయాలని చెప్పి పడిపోయాడు.  అతడిని వల్లభి ప్రభుత్వ దవాఖానాకు తరలించగా డాక్టర్లు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తోట నాగరాజు తెలిపారు.

గ్రామంలో భయం భయం

ఈ ఘటన గురించి గ్రామంలో తెలియడంతో జనాలంతా భయపడుతున్నారు. ఎవరో ఇంజక్షన్​ ఇచ్చి చంపేశారని ప్రచారం జరగడంతో బయటకు వెళ్లడానికి వణుకుతున్నారు. గతంలో కూడా ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయని, అయితే ఎవరూ చనిపోలేదని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు.  అయితే రూరల్ ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ తాము సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించామన్నారు. గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. గ్రామస్తులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.