- రూ.4.50 లక్షల విలువైన ఆశిష్ డ్రగ్ స్వాధీనం
గ్రేటర్ వరంగల్, వెలుగు : మత్తు మందును అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని వరంగల్‌లో పోలీసులు, స్టేట్ నార్కోటిక్ ఆఫీసర్లు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మట్టెవాడ ఏపీసీ నందిరామ్ నాయక్ సోమవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరానికి చెందిన చింతల వెంకటరాజు అలియాస్ బాబీ వరంగల్ నగరంలోని ఏడు మోరీల ప్రాంతంలో సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మట్టెవాడ పోలీసులు, తెలంగాణ నార్కోటిక్ అనాలిసిస్ విభాగం ఆఫీసర్‌తో కలిసి అక్కడికి వచ్చారు. వెంకటరాజును అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద లీటర్ ఆశిష్ డ్రగ్ దొరికింది. దీంతో దానిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తుమందు విలువ సుమారు రూ.4.50 లక్షలు ఉంటుందని ఏపీసీ తెలిపారు. సమావేశంలో మట్టెవాడ సీఐ గోపీ ఉన్నారు.