నల్గొండలో గుత్తా X ఎమ్మెల్యేలు!

  • నల్గొండలో గుత్తా X ఎమ్మెల్యేలు!
  • మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి ఎగదోస్తున్నారని నేతల ఫైర్ 
  • ఓడిపోతే అంతుచూస్తామని హెచ్చరికలు
  • కొడుకుకు టికెట్ రాకపోవ డంతో సుఖేందర్​రెడ్డి నారాజ్​
  • తాజా పరిణామాలతో క్యాడర్​లో అయోమయం

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​ రెడ్డి, అక్కడి ఎమ్మెల్యేల నడుమ పొలిటికల్ వార్​నడుస్తోంది. ఇన్నాళ్లూ సైలెంట్​గా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా గుత్తాను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో గుత్తా అసమ్మతి ఎగదోస్తున్నారని, ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని బెదిరిస్తున్నారు. గుత్తాపై హైకమాండ్ దాకా ఫిర్యాదులు పోవడం, అక్కడి నుంచి కూడా గ్రీన్​సిగ్నల్ ​రావడం వల్లే ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారనే చర్చ జరుగుతోంది. నల్గొండ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో గుత్తా క్యాడర్ ​బలంగా పని చేస్తోంది. మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి మీదున్న వ్యతిరేకత తన కొడుకు రాజకీయ ఎంట్రీకి కలిసి వస్తుందని గుత్తా భావించారు. 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ కూడా భరోసా ఇవ్వడంతో తన కొడుకు అమిత్​రెడ్డికి ఎలాగైనా మునుగోడు టికెట్ ఖాయమని అనుకున్నారు. అమిత్​ ఎంట్రీతో మునుగోడులో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పూర్తిగా సుఖేందర్ ​రెడ్డి కంట్రోలోకి వచ్చింది. తీరా సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే  కేసీఆర్ ​చాన్స్ ​ఇవ్వడంతో అమిత్​సైడ్​ అయ్యారు. కానీ క్యాడర్ మాత్రం ఇప్పటికీ గుత్తాతో టచ్​లో ఉంది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి, గుత్తా ఇద్దరిదీ చిట్యాల మండలం ఉరుమడ్ల. ఒకే గ్రామానికి చెందిన వీరి మధ్య రాజకీయ విభేదాలు టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. బీఆర్ఎస్​లోకి వచ్చాక కూడా అలాగే కొనసాగుతున్నాయి. ఉరుమడ్లలో ఒక ల్యాండ్​ ఇష్యూలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ తర్వాత నల్గొండలోని ప్రకాశం బజార్​మడిగల వివాదం, మైనార్టీలకు లోన్లు ఇప్పించే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో భూపాల్​కు టికెట్​వస్తే తాను ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని గుత్తా తన అనుచరులతో అన్న విషయం ఎమ్మెల్యేకు చేరింది. దీనిపై భగ్గుమన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైతే అందుకు గుత్తా బాధ్యత వహించాల్సిందేనని సీరియ స్​గానే చెప్పినట్టు సమాచారం. 

దేవరకొండలో ముదిరిన లొల్లి...

ఒకప్పుడు గుత్తా కోటరీలో ఉన్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్..​ ప్రస్తుతం మంత్రి జగదీశ్​రెడ్డి టీమ్​లో చేరారు. గుత్తాతో కలిసే బీఆర్ఎస్​లో చేరిన రవీంద్రకుమార్.. 2018లో తొలిసారి బీఆర్ఎస్ టికెట్​పై పోటీ చేసినప్పుడు దేవరకొండలో గుత్తా టీమ్ సహకరించింది. ఆర్థికంగా గుత్తా సపోర్ట్​ కూడా చేశారని చెప్తారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొంత కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. గుత్తా మాట తీరు సరిగా లేదని, అందువల్లే ఎమ్మెల్యే దూరం కావాల్సి వచ్చిందని ఆయన వర్గం చెప్తోంది. కానీ గుత్తా సపోర్ట్​తోనే ఎమ్మెల్యే సీటుతో పాటు మున్సిపల్​, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిచిందని ఈయన వర్గం అంటోంది. ఆర్థిక, రాజకీయ అంశాలే వీరిద్దరి మధ్య చిచ్చురేపాయని, దీంతోనే  దేవరకొండలో పార్టీ రెండుగా చీలిపోయిందని చెప్తున్నారు. గత రెండేండ్ల నుంచి గుత్తా దేవరకొండలో పర్యటిస్తున్నా ఎమ్మెల్యేతో అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఈ క్రమంలో గుత్తా వర్గం లీడర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మండలాల వారీగా నిరసన సభలు పెడ్తున్నారు. 

గుత్తాకు హెచ్చరికలు...

గుత్తాపై ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులను హైకమాండ్​ సీరియస్​గా తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి టికెట్లు కనఫర్మ్​ అయ్యాక ముగ్గురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా గుత్తాను మర్యాద పూర్వకంగా కలిశారు. సహకరించాలని కోరారు. నియోజకవర్గాల్లో అసమ్మతి చల్లార్చేందుకు ఎమ్మెల్యేలు ఒక మెట్టు దిగొచ్చారు. హైకమాండ్​ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు గుత్తాను కలిసినట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ నియోజకవర్గాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పాత పద్ధతిలోనే విభేదాలు కొనసాగుతున్నాయి. గుత్తా సర్ది చెప్తున్నా గొడవలు ఆగే పరిస్థితి లేదని, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతే ఇందుకు కారణమని సుఖేందర్​రెడ్డి వర్గం అంటోంది. ఇటీవల గణేశ్ నవరాత్రుల్లో అసమ్మతి మరింత ముదిరి రచ్చకెక్కడంతో ఎమ్మెల్యేలు సీరియస్​గా ఉన్నారు. ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వస్తే సుఖేందర్​ రెడ్డి అంతు చూస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తుండటం హాట్ టాపిక్​లా మారింది.