
తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్దమసాన్ పల్లి గ్రామంలో మావోయిస్ట్పేరిట ఓ పోస్టర్ కలకలం రేపింది. 2014లో తొగుట, కొండపాక మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దళారుల నుంచి కొన్ని వందల ఎకరాల భూమిని ప్రవేట్ వ్యక్తులు సేకరించారు. కొన్ని నెలల తర్వాత అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
గ్రామస్తులు ఫార్మా కంపెనీ వస్తే భుగర్భ జలాలు కలుషితం అవుతాయని కంపెనీ ఏర్పాటును అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆ భూమిలో ఎలాంటి పనులు చేయలేదు. కానీ ఇటీవల ఈ భూమిలో కొందరు ప్రవేట్ వ్యక్తులు మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించడంతో గ్రామస్తులు కలెక్టర్, తహసీల్దార్‌కు కంపెనీ నిర్మాణం చేయొద్దంటూ వినతి పత్రాలు సమర్పించారు.
ఆదివారం రోజున మావోయిస్ట్ పార్టీ పేరుతో ఎరుపు రంగు జెండా పై రెండు మండలాల నుంచి సేకరించిన 1500 ఎకారాల భూమిని వెంటనే పేదలకు అప్పగించాలని, కంపెనీ నిర్మించాలని ప్రయత్నిస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని పోస్టర్ వేశారు. ఈ విషయాన్ని తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్లతీఫ్ ను వివరణ కోరగా పోస్టర్లు వెలిసిన విషయం వాస్తవమే కానీ వాటిని ఎవరు వేశారో విచారణ చేస్తున్నామని తెలిపారు.