- రెండు గ్రూపులుగా విడిపోయిన ఉద్యోగులు
- ఒక గ్రూప్ అవినీతి వ్యవహారాలు బహిర్గతం చేస్తున్న మరో గ్రూప్
- ఆదివారం ఈవో ముందే కొట్టుకోబోయిన ఏఈవో, ఏఈ
- గొడవలకు లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులే కారణమంటూ ప్రచారం
సిద్దిపేట, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలని ప్రయత్నాలు చేస్తుండడం గొడవకు కారణం అవుతున్నాయి. గతంలో ‘ఆకాశ రామన్న, కోటయ్య’ పేరిట ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందగా, తాజాగా ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వచ్చారు.
ఈ క్రమంలో ఆదివారం జరిగిన గొడవలో ఓ ఉద్యోగి గాయపడగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని ఈవో ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ఉద్యోగులు ఒకే చోట ఏండ్ల తరబడి పనిచేస్తుండడం వల్ల ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో గొడవలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డ్యూటీకి రాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు
మల్లన్న ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు హాజరుకాకుండానే రిజిస్టర్లలో మాత్రం సంతకాలు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆలయంలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులు ఇటీవల నాలుగు రోజుల పాటు గానుగాపూర్ టూర్‌కు వెళ్లారు. ఆ టైంలో అటెండెన్స్ రిజిస్టర్‌లో పెన్సిల్‌తో ‘సీఎల్’ అని రాశారు. టూర్ నుంచి వచ్చిన తర్వాత సీఎల్‌ను చెరిపి, డ్యూటీకి హాజరైనట్లు సంతకాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మరో ఉద్యోగి రిజిస్టర్ ఫొటో తీసి బయటకు సెండ్ చేయడంతో వివాదం ముదిరింది.
అయితే ఓ టెండర్ బిల్లుకు సంబంధించిన చెల్లింపులను నిలిపివేసినందునే సదరు ఉద్యోగి ‘సంతకాల’ వ్యవహారాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు ఎదుటి వారి తప్పులను బయట పెడుతుండడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పెద్దల అండదండలున్న కొందరు తమ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్న వారిని రక్షించుకుంటూ ప్రత్యర్థి గ్రూప్‌లో ఉన్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
గదుల కేటాయింపులో చేతివాటం
కొమురవెల్లిలో భక్తులకు వసతి గదులను కేటాయించే విషయంలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల గదుల కేటాయింపులో అవినీతికి పాల్పడిన ఓ ఉద్యోగిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నప్పటికీ చూసీచూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. వీకెండ్స్‌లో కొమురవెల్లికి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వసతి గదుల కొరత తీవ్రంగా ఉంటుంది.
దీన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తం వసూలు చేసి గదులను కేటాయిస్తున్న కొందరు ఉద్యోగులు ఆ విషయాన్ని మాత్రం రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదని సమాచారం. ఈ అవినీతి వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
ప్రత్యేక జీవోతో పెత్తనం
ఇతర ప్రభుత్వ శాఖల్లో మూడేళ్లు దాటిన ఉద్యోగులను బదిలీ చేస్తున్న ప్రభుత్వం ఎండోమెంట్ ఉద్యోగుల విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొమురవెల్లి దేవస్థానంలో ప్రస్తుతం వివిధ హోదాల్లో 22 మంది పర్మినెంట్, 25 మంది పూజారులతో పాటు వివిధ విభాగాల్లో 29 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 62 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజువారీ వేతనంపై పనిచేస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లోని 888 జీవోను అడ్డం పెట్టుకొని కొందరు ఉద్యోగులు ఇష్టారీతిగా వ్యవరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ జీవో ప్రకారం ఒక ఉద్యోగి ఎక్కడ అపాయింట్ అయ్యాడే అక్కడే రిటైర్మెంట్ వరకు పనిచేయవచ్చు. క్రమశిక్షణా చర్యల కింద బదిలీ అవుతున్న ఉద్యోగులు ఈ జీవోను అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లి స్టే వెళ్లి స్టే తెచ్చుకున్న సంధర్భాలు సైతం ఉన్నాయి. లాంగ్ స్టాండింగ్ కారణంగా అవినీతి, అక్రమాలకు పాల్పడడమే కాకుండా స్థానిక నేతలతో కుమ్మకై ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరో వైపు ఆలయాల కేటగిరీల విభజన కారణంగా ఉద్యోగుల బదిలీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఒక కేటగిరిలో పనిచేస్తున్న ఉద్యోగులను అదే కేటగిరిలోని ఆలయానికి మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. కొమురవెల్లి ఆలయం 6ఏ కేటగీరిలో ఉండడంతో ప్రత్యేక పరిస్థితులను సాకుగా చూపి ఉద్యోగులు బాసర, కొండగట్టు, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్‌కు మాత్రమే బదిలీ చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులపైనే ఆరోపణలు
కొమురవెల్లి ఆలయంలో లాంగ్ స్టాండింగ్ ఉద్యోగుల వల్లే పాలన గాడి తప్పుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు 20 సంవత్సరాలకు పైగా ఇక్కడే పనిచేస్తుండడం గమనార్హం. ఇటీవల జాతరకు ముందు నూతన పాలకవర్గం ఏర్పాటైన సందర్భంగా లాంగ్ స్టాండింగ్ ఎంప్లాయీస్‌పై చర్చ జరిగింది. ఆలయ పాలనను గాడిలో పెట్టాలంటే చాలా కాలంగా తిష్ట వేసిన వివిధ స్థాయి ఉద్యోగులకు స్థాన చలనం కలిగించాలనే విషయాన్ని గుర్తించారు. లాంగ్ స్టాండింగ్ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ విషయాన్ని ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి వెళ్లారని, ఈ విషయంపై కొన్ని రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది.