- యాదాద్రి పవర్ప్లాంట్అక్రమాలపై నిలదీస్తున్న బ్రదర్స్
- వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ
- తాడోపేడో తేల్చుకుందాం రమ్మంటూ మాజీ మంత్రి సవాల్
- వ్యక్తిగత దూషణలతో రచ్చ రచ్చ
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య ‘పవర్’ వార్మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేరాజగోపాల్ రెడ్డిలకు, బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి నడుమ మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. రాజకీయ విమర్శలతో మొదలైన వివాదం వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, ఎంపీ ఎన్నికలయ్యాక సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ జగదీశ్‌రెడ్డి చేసిన కామెంట్లతో ఈ రచ్చ మొదలైంది. మాజీ మంత్రి తనపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికే సీఎంపై విమర్శలు చేస్తున్నారని బ్రదర్స్కౌంటర్ఇచ్చినా జగదీశ్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు. దీంతో యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో జరిగిన పదివేల కోట్ల కుంభకోణంలో జగదీశ్‌రెడ్డి పాత్ర కూడా ఉందని, త్వరలోనే ఆయన జైలుకెళ్లడం ఖాయమని బ్రదర్స్ ఆరోపించడంతో ఇష్యూ కొత్త మలుపు తిరిగింది.
చర్చంతా యాదాద్రి థర్మల్‌ప్లాంట్ అక్రమాలచుట్టే..
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో నాటి సర్కారు యాదాద్రి థర్మల్పవర్ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. రూ.25వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో ప్రారంభించిన ఈ ప్లాంట్‌నిర్మాణం 2021లో పూర్తి కావాలి. ఇది కంప్లీట్అయితే 4 వేల మెగావా ట్ల విద్యుత్జనరేట్ అవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, తొమ్మిదేండ్లు గడుస్తున్నా ప్రాజెక్టు కంప్లీట్కాకపోగా, అంచనా వ్యయం రూ.50 వేల కోట్లకు చేరింది. అంచనా వ్యయం డబుల్కావడంతో అనుమానం వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. ఈలోపే ఎంపీ ఎన్నికల వేడి మొదలవడం, బ్రదర్స్, సీఎం రేవంత్లక్ష్యంగా జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు, తిట్ల పురాణం అందుకోవడంతో పవర్‌ప్లాంట్‌లో జరిగిన స్కాం గురించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ను ముందరపెట్టి, తెర వెనుక కాంట్రాక్ట్ పనులను నామినేషన్ పద్ధతిలో అనుచరులకు అప్పగించారని, తద్వారా కేసీఆర్, జగదీశ్‌రెడ్డి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై జగదీశ్‌రెడ్డి గురువారం తీవ్రంగా స్పందించారు.
వ్యక్తిగత దూషణలతో రాజకీయ దుమారం..
ఎవరు అవినీతికి పాల్పడ్డారో, ఎవరు, ఎన్ని కోట్లు అప్పనంగా సంపాదించారో, సొంత ఊళ్లకు పోయి చర్చిద్దామని జగదీశ్‌రెడ్డి గురువారం సవాల్ విసిరారు. థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వం, జెన్కో మధ్య జరిగిన ఒప్పందం అని, పనులు క్వాలిటీగా, నిజాయితీగా చేపట్టేందుకే బీహెచ్ఈఎల్కు నాటి ప్రభుత్వం అప్పగించిందని జగదీశ్ రెడ్డి అన్నారు. దీంట్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమైనని చాలెంజ్ విసిరారు. ఇక్కడితో ఆగకుండా వాడు, వీడు, అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పరిగెత్తించి కొడ్తాం , బట్టలు ఊడదీసి కొడ్తాం.. అంటూ హెచ్చరికలు చేసుకోవడం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒక వైపు నామినేషన్ల హడావుడి మొదలు కాగా, మరోవైపు బ్రదర్స్, జగదీష్ రెడ్డి మధ్య తీవ్రస్థాయికి చేరిన డైలాగ్వార్కాస్తా నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని దారి మళ్లించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.