గూడూరు, వెలుగు : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని డాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెంది గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన బైరి మమత(29)కు అదే గ్రామానికి చెందిన ఎల్లస్వామితో ఐదేండ్ల కింద పెండ్లి అయింది. చానాళ్లకు ఆమె గర్భం దాల్చింది. ఇటీవల డెలివరీ సమయం దగ్గర పడుతుండగా చెకప్ కోసం గత శనివారం డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకోగా టెస్ట్ లు చేశారు. ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని, ఆపరేషన్ చేసి పిండాన్ని తీసివేయాల్సి ఉంటుందని డాక్టర్ సూచించాడు.
దీంతో మమత తీవ్ర మనస్తాపానికి లోనైంది. సోమవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రాగా కుటుంబసభ్యుల తో చెప్పింది. ఆశ వర్కర్ వద్దకు వెళ్లగా ఉదయం ఆస్పత్రికి వెళ్దామని చెప్పగా ఇంటికి వెళ్లి నిద్రపోయింది. తెల్లారి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా బంధువుల వద్ద వాకబు చేసినా ఫలితంలేదు. దీంతో మంగళవారం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఇంటికి సమీపంలోని చెరువులో మమత శవం తేలింది. మృతురాలి తల్లి యాకమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.