
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లపై ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్
‘స్టెఫలో కోకస్’ బారిన బాలింతలు
పరికరాలను స్టెరిలైజ్ చేయకపోవడంతోనే వ్యాప్తి
ఆలస్యమైతే మరిన్ని ప్రాణాలు పోయేవి!
డీపీఎల్ మరణాలపై సిద్ధమైన ప్రైమరీ రిపోర్ట్
గంటలోనే 34 మందికి సర్జరీ
ఇయ్యాల స్టాఫ్‌ను ప్రశ్నించనున్న కమిటీ
హైదరాబాద్, వెలుగు : ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ క్యాంపు మరణాలకు గల కారణాలపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఆపరేషన్ తర్వాత చనిపోయిన నలుగురికి ‘స్టెఫిలో కోకస్’ అనే ప్రమాదకర బ్యాక్టీరియా సోకినట్టు ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ రిపోర్ట్స్ ఇచ్చారు. సర్జరీల కోసం వాడే ఎక్విప్‌మెంట్, హాస్పిటల్ వాతావరణంలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. డీపీఎల్ సర్జరీల కోసం వాడిన ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్‌మెంట్ స్టెరిలైజ్ చేయకపోవడంతో ఈ బ్యాక్టీరియా సోకి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. చనిపోయిన నలుగురితో పాటు ఆ రోజు సర్జరీ చేయించుకున్న మరో 25 మంది కూడా స్టెఫిలో కోకస్ బారినపడినట్టు తెలిసింది. వీళ్లలో కొంత మందికి కడుపులో ఇన్ఫెక్షన్ అయి ల్యాప్రోస్కోపిక్ హోల్, రింగ్స్ చుట్టూ చీము వచ్చింది. నిమ్స్, అపోలో డాక్టర్లు చీమును క్లీన్ చేసి, మహిళలను అబ్జర్వేషన్‌లో ఉంచారు. కొంత మందికి ఇన్ఫెక్షన్ స్థాయి తక్కువగా ఉండటంతో, వారికి యాంటి బయాటిక్స్‌తో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. హాస్పిటల్‌లో ఉన్న 30 మందిలో ఇద్దరు మాత్రమే పూర్తిగా కోలుకోగా, మిగిలిన వాళ్లంతా ఇప్పటికీ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గురువారం ఆరోగ్యశాఖ తెలిపింది.
గంటలోనే డిశ్చార్జి
పోయిన నెల 25న ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రంగారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్‌వో, డాక్టర్ నాగజ్యోతి డీపీఎల్ క్యాంపు ఏర్పాటు చేశారు. డాక్టర్లు, నర్సులు మొత్తం 27 మందికి క్యాంపు డ్యూటీలను వేస్తూ నాగజ్యోతి ఉత్తర్వులిచ్చారు. చుట్టు పక్క 7 పీహెచ్‌సీల నుంచి డీపీఎల్ (డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోపిక్) సర్జరీల కోసం మహిళలను ఆశ వర్కర్లు ఇక్కడికి తీసుకొచ్చారు. ఉదయం 9 కల్లా మహిళలు వచ్చినా.. మధ్యాహ్నం 12 తర్వాత సర్జరీ చేయాల్సిన డాక్టర్ వచ్చారు. ఒంటి గంటకు ఆపరేషన్లు ప్రారంభించి.. 2 గంటల కల్లా 34 మందికి సర్జరీ చేశారు. మొత్తం 3 సెట్ల ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్‌మెంట్ వాడారు. ఒక సర్జరీ తర్వాత కనీసం 20 నిమిషాలు ఎక్విప్‌మెంట్‌ను స్టెరిలైజ్ చేయాలి. ఆ రోజు స్టెరిలైజ్ చేయడానికి 3 –4 నిమిషాల టైం మాత్రమే దొరికింది. ఆ రోజు స్టెరిలైజ్ డ్యూటీలో అనుభవంలేని నర్సులు ఉన్నట్టు చెబుతున్నారు. 3 గంటల కల్లా అందరినీ హడావుడిగా డిశ్చార్జ్ చేయడం వల్లే నలుగురు ప్రాణాలు పోయాయని అంటున్నారు.
ఇయ్యాల స్టాఫ్‌ను ప్రశ్నించనున్న కమిటీ
పోయిన నెల 25న ఏం జరిగిందో ఎంక్వైరీ చేయడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని డాక్టర్ల టీం శుక్రవారం ఇబ్రహీంపట్నం హాస్పిటల్ వెళ్తుంది. స్టాఫ్‌ను ప్రశ్నించనుంది. సర్జరీ చేసిన డాక్టర్, స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే మహిళలు ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. శుక్రవారం నాటి ఎంక్వైరీ తర్వాత, తుది నివేదిక తయారు చేస్తారు. ఈ నెల 5 కల్లా రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించినట్టు తెలిసింది.
గవర్నర్ తమిళి సై సీరియస్
ఇబ్రహీంపట్నం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు వికటించిన ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. చనిపోయిన బాధిత కుటుంబాలను అండగా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న వారిని త్వరలోనే పరామర్శిస్తానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులు పుదుచ్చేరి పర్యటనలో ఉన్న ఆమె దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు దారుణమని వ్యాఖ్యానించారు.
డీపీఎల్ క్యాంపులు తాత్కాలిక బంద్
ఇబ్రహీంపట్నం ఘటన కారణంగా డీపీఎల్ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది. ఒక పద్ధతి ప్రకారం క్యాంపులు నిర్వహించాలని భావిస్తున్నది. ఇందుకు అవసరమైన నిబంధనలు రూపొందించాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో స్టడీ చేసి నిబంధనలు రూపొందిస్తామని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఒక డాక్టర్ రోజుకు పది డీపీఎల్ సర్జరీలే చేయాలి. ఒక హాస్పిటల్‌లో ఒకరోజుకు 30 సర్జరీలే చేయాలన్న నిబంధనలు గాలికొదిలేశారు.
కడుపు ఉబ్బిందంటే.. ఏం కాదన్నరు..
మధ్యాహ్నం 2 గంటలకు నాకు ఆపరేషన్ చేసిన్రు. గంటసేపు ఉంచి ఇంటికి పొమ్మన్నరు. ఆ రోజు రాత్రికే కడుపు అంతా ఉబ్బింది. సిస్టర్‌కు ఫోన్ చేస్తే, ఫొటోలు పంపించమని చెప్పింది. ఫొటోలు పంపినంక చూసి, అట్లనే అయితది. మందులు ఏసుకో అని చెప్పి పెట్టేసింది. ఇద్దరు చచ్చిపోయినంక మాకు ఫోన్లు చేసి నల్గొండ హాస్పిటల్‌కు తీసుకుపోయిన్రు. అక్కడ్నుంచి నిమ్స్‌కు తీసుకొచ్చి, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పిన్రు.
- లక్ష్మమ్మ, బాధితురాలు