ఖమ్మం జిల్లాలో మంటల్లో దగ్ధమైన స్కూలు బస్సు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఓ ప్రైవేటు స్కూలు బస్సు షాట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో దగ్ధమైంది. తేజ టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు.. ఖమ్మం నుండి కోదాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మంలోని ముస్తఫానగర్ లో ఓ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై.. తిరిగి కోదాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది పెళ్లి బృందానికి చెందిన వాళ్లు ఉన్నారు. 

బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. అందర్నీ అప్రమత్తం చేసి, బస్సును పక్కకు ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత పెళ్లి బృందం సభ్యులు మరో బస్సులో ఇంటికి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంకులతో మంటలను ఆర్పి వేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. సమయానికి స్థానికంగా ఫైర్ ఇంజన్ లేదని తెలుస్తోంది.