ఉన్నట్టుండి వర్షం గాల్లోనే ఆగిపోవడం ఎప్పుడైనా చూశారా! అది సృష్టికి విరుద్ధం, అలా ఎప్పటికీ జరగదు. భూమికి గ్రావిటీ పవర్ ఉంటుంది. దానివల్ల ఏదైనా పై నుంచి కిందకి పడుతుంది అంటూ న్యూటన్ థియరీ తెలిసిన వాళ్లందరూ దీని గురించి తెలుసుకోవాల్సిందే. అదే.. వర్షాన్ని గాల్లోనే ఆపగలిగే రెయిన్ రూం.
లండన్, బెర్లిన్లలో ‘రాండమ్ ఇంటర్నేషనల్’ అనే ఆర్ట్ గ్రూప్‌ని 2005లో స్థాపించారు. ఇందులో శిల్పకళ, ఆర్కిటెక్చరల్ ఇన్‌స్టాలేషన్స్ వంటి రకరకాల అంశాలుంటాయి. అందులో భాగమే ఈ రెయిన్ రూం. దీన్ని 2012లో హెన్నెస్ కోచ్, ఫ్లోరియన్ ఆర్ట్ క్రాస్లు చేసిన ఎక్స్పరిమెంట్. దీన్ని 2018లో యూఏఈలోని షార్జాలో పర్మినెంట్‌గా ఉండేలా రూపొందించారు. ఈ రెయిన్ రూంని షార్జా ఆర్ట్ ఫౌండేషన్, యూఏఈకి సంబంధించిన స్పేస్ కాంటినుమ్ డిజైన్ స్టూడియో కలిసి రూపొందించాయి. 2018 మేలో ఆర్ట్ ఫౌండేషన్ కలెక్షన్లో భాగంగా దీన్ని ఓపెన్ చేశారు. అంతకు ముందు న్యూయార్క్, లండన్‌లో కూడా దీన్ని ప్రదర్శించారు రాండమ్ ఇంటర్నేషనల్స్ ఇమ్మెర్సివ్ ఇన్స్టలేషన్ నిర్వాహకులు. ఈ గదిలో ఆర్టిఫిషియల్ రెయిన్ కురిపిస్తారు. కానీ, వర్షం పడేటప్పుడు వెరైటీ టెక్నాలజీని ఉపయోగించి నీటిచుక్కల్ని కిందపడకుండా గాల్లోనే ఆపేస్తారట. అందువల్ల అస్సలు తడవం. రెయిన్ కోసం రీసైకిల్ చేసిన 2,500 లీటర్ల నీటిని వాడతారు. ఆ ప్రదేశాన్ని ట్రిగ్గర్ సెన్సర్స్, నెట్వర్క్ ఉన్న 3–డి ట్రాకింగ్ కెమెరాలతో కంట్రోల్ చేస్తారు.
రెయిన్ రూంలోకి వెళ్లాలంటే..
22 ఏళ్ల లోపు ఉన్న స్టూడెంట్స్, ఐడికార్డుతో వస్తేనే టికెట్ ఇచ్చి రెయిన్ రూంలోకి వెళ్లనిస్తారు. టీచర్లకు కూడా ఇదే రూల్. ఐదేళ్ల లోపు పిల్లలకు, వికలాంగులకు టికెట్ ఉండదు. వాళ్లు ఫ్రీగా వెళ్లొచ్చు. శనివారం, గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి, రాత్రి తొమ్మిది వరకు. శుక్రవారం మాత్రం సాయంత్రం నాలుగ్గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ఓపెన్ ఉంటుంది. రూం లోకి ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లకూడదు. వర్షం పడుతుంది కదా అని గొడుగులు వంటివి తీసుకెళ్లకూడదు. హీల్ ఉన్న షూ వేసుకోవాలి. ముదురు రంగు, మెరుపుల డ్రెస్‌లు వేసుకోకూడదు. కెమెరాలు, మొబైల్స్ వాడకూడదు. పర్మిషన్ లేకుండా ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కూడా చేయకూడదు. ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితేనే రెయిన్ రూంలోకి ఎంట్రీ.