అహ్మదాబాద్ లో విజృంభిస్తున్నఫంగస్ ..తొమ్మిది మంది మృతి

అహ్మదాబాద్ లో విజృంభిస్తున్నఫంగస్ ..తొమ్మిది మంది మృతి
  • ఢిల్లీ, ముంబైలోనూ వెలుగు చూస్తున్న కేసులు
  • కరోనా వచ్చి, తగ్గినోళ్లకు రిస్క్ ఎక్కువంటున్న డాక్టర్లు

న్యూఢిల్లీఅహ్మదాబాద్ లో అరుదైన ఫంగస్ వ్యాధి విజృంభిస్తోంది. బ్లాక్ ఫంగల్ డిసీజ్ (మ్యూకర్ మైకోసిస్) అనే ఈ రోగం ఇప్పటికే 44 మందికి సోకగా, 9 మంది చనిపోయారు. ఈ వ్యాధి సోకినోళ్లోలో సగం మందికి కంటిచూపు పోవడం, ముక్కు, దవడ ఎముకను తొలగించాల్సి వస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. ఢిల్లీ, ముంబైలోనూ బ్లాక్ ఫంగల్ కేసులు వెలుగు చూస్తున్నాయని వెల్లడించారు. గత 15 రోజుల్లోనే ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ లో13 బ్లాక్ ఫంగస్ కేసులు వచ్చాయని, వీరంతా కరోనా వచ్చి తగ్గిపోయినోళ్లేనని డాక్టర్లు తెలిపారు. కరోనా వచ్చి
తగ్గినోళ్లకు బ్లాక్ ఫంగస్ ముప్పు తీవ్రంగా ఉంటుందని చెప్పారు.

సింప్టమ్స్ ఎలా ఉంటయ్?

బ్లాక్ ఫంగస్ పేషెంట్లలో ఫంగస్ శరీరంలో ఏ పార్ట్ లోకి చేరిందన్న దానిని బట్టి సింప్టమ్స్ వేర్వేరుగా ఉంటాయి. ఫంగస్ ముక్కు లోపలి మార్గంలో లేదా బ్రెయిన్ లో పెరిగితే.. ముఖం ఒకవైపు వాచిపోవడం, తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ వంటివి కన్పిస్తాయి. ముక్కు, నోటి లోపల పైవైపున నల్లటి చారలు కన్పిస్తాయి. ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరితే.. జ్వరం, దగ్గు, చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఫంగస్ చర్మంపై పెరిగితే దద్దుర్లు, పుండ్లు వస్తాయి. అక్కడ చర్మం నల్లగా మారుతుంది. గాయం వద్ద వెచ్చగా, నొప్పిగా ఉంటుంది. దానిచుట్టూ ఎర్రగా కందిపోయినట్లు కూడా అవుతుంది. ఫంగస్ పేగుల్లోకి చేరితే కడుపు నొప్పి, వాంతులు, వికారం, పేగుల్లో బ్లీడింగ్ వంటివి జరగొచ్చు.

ట్రీట్ మెంట్ ఏమిటి?

మ్యూకర్ మైకోసిస్‌కు డాక్టర్లు ప్రత్యేకమైన యాంటీ ఫంగల్ మెడిసిన్స్‌‌తో ట్రీట్‌మెంట్ చేస్తారు. మందులతో తగ్గకపోతే ఫంగస్ పెరిగిన టిష్యూ లేదా బోన్స్‌‌ను సర్జరీ చేసి కట్ చేయాల్సి ఉంటుంది.

ఏమిటీ రోగం?

బ్లాక్ ఫంగల్ డిసీజ్ కొత్తదేమీ కాదని, ఇది అరుదైన ఒక పాత ఫంగల్ వ్యాధేనని డాక్టర్లు చెప్పారు. మ్యూకర్ మైసిటిస్ గ్రూపుకు చెందిన బూజులు శరీరంలోకి ఎంటర్ అయితే, వాటివల్ల మ్యూకర్ మైకోసిస్ వ్యాధి వస్తుంది. మ్యూకర్ మైసిటిస్ బూజులకు చెందిన స్పోర్స్ ను గాలి ద్వారా పీల్చినప్పుడు ఇవి శరీరంలోకి ఎంటరవుతాయి. చాలావరకూ ఇంతకుముందు వేరే వ్యాధులకు గురైనవారు, ఇమ్యూనిటీని అణిచేసే మందులు తీసుకుంటున్నవారికి ఇవి ప్రాణాంతకంగా మారుతాయి. అయితే కరోనా వచ్చి, తగ్గిపోయినవాళ్లలో ప్రధానంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నోళ్లకు, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ పేషెంట్లు, ఐసీయూల్లో చేరిన వాళ్లకు ఇప్పుడు దీని ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు.