ముగ్గురు మూడు వేర్వేరు పార్టీలకు (బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్) చెందిన నేతలు. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు వర్షం కురిపించుకుంటారు. అలాంటిది ఒకచోట ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కానీ ఇక్కడ మాత్రం మీరు అనుకున్నట్లుగా ఏం జరగలేదు. నిత్యం లేచిన దగ్గరి నుండి ఒకరిపై ఒకరు విమర్శల కత్తులు దూసుకునే నేతలు ఓ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఒక వేదికపై కూర్చొని కులాసాగా ముచ్చటించారు. సరదాగా మాట్లాడుకుంటూ టైమ్ గడిపారు.
ఈ రేర్ సీన్ చూసిన మూడు పార్టీల కేడర్ ఖుష్ అవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా తమ నాయకులు కలిసి హుందాగా వ్యవహరించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఇవాళ (2024, అక్టోబర్ 7) కరీంనగర్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ మహాశక్తి దేవి ఆలయంలో పెద్ద ఎత్తున దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ మహాశక్తి అమ్మవార్లను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకున్నారు.
ALSO READ | ఈడీ కస్టడీకి సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ
కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ 11 రోజుల భవానీ దీక్షలో భాగంగా మహాశక్తి ఆలయంలోనే ప్రస్తుతం బస చేస్తు్న్నారు. ఈ క్రమంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేలు గుంగుల, కవ్వంపల్లి కేంద్రమంత్రి బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్, గంగల కమలాకర్, మేడిపల్లి సత్యనారాయణ ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమాన్ని ముగ్గురు కలిసి వీక్షించారు. సంజయ్, గంగల కమలాకర్, మేడిపల్లి సత్యనారాయణ ఒకే చోట కూర్చున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన ముగ్గురు నేతల తీరుపై ప్రశంసలు కురుస్తోన్నాయి. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనేనని.. ఆ తర్వాత తామంతా ప్రజా ప్రతినిధులమని నిరూపించారని కేడర్ కొనియాడుతున్నారు.