యూపీ రాజకీయాల్లో రేర్ సీన్.. బద్దశత్రువు మాయవతికి అఖిలేష్ యాదవ్ మద్దతు

యూపీ రాజకీయాల్లో రేర్ సీన్.. బద్దశత్రువు మాయవతికి అఖిలేష్ యాదవ్ మద్దతు

లక్నో: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు.. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామం ఈ మాటలు నిజమని మరోసారి ప్రూవ్ చేశాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయవతి రాజకీయ బద్ద శత్రువులు. నిత్యం లేచిన దగ్గర నుండి ఒక పార్టీపై మరో పార్టీ నేతల విమర్శల వర్షం కురిపించుకుంటారు. ఇదిలా ఉంటే, తన పొలిటికల్ ఎనీమి అయిన బీఎస్పీ చీఫ్ మాయవతికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు పలికారు.

 మాయవతికి అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేయడం ఏంటనుకుంటున్నారా.. ఇందుకు కారణం యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ చౌదరి చేసిన కామెంట్స్. ఇటీవల ఎమ్మెల్యే రాజేశ్ మాట్లాడుతూ.. మాయవతిని యూపీ సీఎం చేసింది బీజేపీనేనని.. ఆమెను ముఖ్యమంత్రిని చేసి మేం తప్పు చేశామని విమర్శించారు. యూపీలో అత్యంత అవినీతి సీఎం మాయవతినే అని రాజేశ్ ఆరోపించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. 

మాయవతిపై బీజేపీ ఎమ్మెల్యే  చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ పరంగా తమ రెండు పార్టీల సిద్ధాంతాలు వేరైనప్పటికీ.. ఒక మహిళగా మాయావతి ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు అన్నారు. మాయవతి బీజేపీ దయతో ముఖ్యమంత్రి కాలేదని.. ప్రజల మద్దతుతో ఆమె సీఎం పీఠాన్ని అధిరోహించారని ఆమెకు సపోర్ట్ చేశారు. రాష్ట్ర మాజీ సీఎం మాయవతిపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై  కేసు నమోదు చేయాలని యోగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అఖిలేష్. రాజకీయ బద్ద శత్రువులైన మాయవతి, అఖిలేష్ యాదవ్ భేటీ కావడం.. ఆమెకు అఖిలేష్ యాదవ్ మద్దతు తెలపడం యూపీ పాలిటిక్స్‎లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.