హైదరాబాద్ లోని రియల్టర్ దారుణ హత్య

బెంగళూరు: హైదరాబాద్ లోని జీడిమెట్ల  ప్రాంతానికి చెందిన ఓ రియల్టర్ కర్నాటకలోని బీదర్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు.  ఈ నెల 24న నగరంలోని చింతల్ వద్ద అదృశ్యమైన రియల్టర్ కుప్పం మధు విగతజీవిగా మారారు.  

కర్నాటక రాష్ట్రంలోని బీదర్ సమీపంలో ప్రత్యర్థులు ఆయనను బండరాయితో మోది అత్యంత దారుణంగా హతమార్చారు. మధు మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 

మధును కిడ్నాప్ చేసిన వారే హత్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. మృతుడు మధు అదృశ్యమైన రోజు ఆయన వెంట ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కూడా మాయమయ్యాయి. మధు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.