- తర్వాతి స్థానంలో చైనా, సౌత్ కొరియా
న్యూఢిల్లీ : అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని తాజా రిపోర్టు ఒకటి వెల్లడించింది. అమెరికాలో ఉన్నత విద్య కోసం ఏటా వివిధ దేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారని పేర్కొంది. కిందటేడాది వరకు ఈ లిస్ట్ లో చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉండేదని యూఎస్ ఓపెన్ డోర్స్ రిపోర్ట్ –2024 తెలిపింది. పదిహేనేండ్ల తర్వాత తొలిసారిగా ఈ జాబితాలో చైనాను కిందకి నెట్టి ఇండియా టాప్ లో నిలిచిందని పేర్కొంది. ఈ ఏడాది ఏకంగా 3,31,602 మంది ఇండియన్ స్టూడెంట్లు అమెరికాలోని వివిధ వర్సిటీలలో చదువుతున్నారని తెలిపింది.
2022–23 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 2,68,923 గా ఉందని చెప్పింది. ఇండియా తర్వాతి స్థానంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశాల్లో చైనా (2,77,398), సౌత్ కొరియా(43,149), కెనడా (28,998), తైవాన్ (23,1457) ఉన్నాయని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. కాగా, మాస్టర్స్, పీహెచ్ డీ చదివేందుకు అమెరికాలో అడుగుపెడుతున్న విద్యార్థుల్లో వరుసగా రెండో ఏడాది కూడా ఇండియన్లే టాప్ లో ఉన్నారని రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్లలో 1,96,567 మంది మాస్టర్స్, పీహెచ్ డీ కోర్సుల్లోనే ఉన్నారని వివరించింది.
గతేడాది కంటే ఈ సంఖ్య 19 శాతం ఎక్కువని తెలిపింది. ఇక, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు వచ్చిన భారతీయుల సంఖ్య 36,053 కు చేరిందని పేర్కొంది. అదే సమయంలో నాన్ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 1,426 మేరకు తగ్గిందని వివరించింది.