డేంజర్ అలర్ట్: హైదరాబాద్‌లో బతకలేం! ప్రమాదకర స్థాయిలో విష వాయువులు

డేంజర్ అలర్ట్: హైదరాబాద్‌లో బతకలేం! ప్రమాదకర స్థాయిలో విష వాయువులు

 హైదరాబాద్, వెలుగు: వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం.. నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలను హరించే విషవాయువు. అదే ఓజోన్ గ్యాస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయువు స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్ లోనూ పలు చోట్ల ‘గ్రౌండ్ లెవెల్ ఓజోన్’ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సూచించిన ప్రమాణాలకు మించి నమోదు అవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.

 దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) విడుదల చేస్తుంటుంది. ఆయా నగరాల్లోని ఏక్యూఐ లెక్కలతోపాటు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ (కాలుష్య కారకాల) స్థాయిలను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) అనే సంస్థ స్టడీ చేసింది.

(మొదటి పేజీ తరువాయి)
 హైదరాబాద్ లోనూ సీపీసీబీ పరిధిలోకి వచ్చే 14 ప్రాంతాల్లో 2020 నుంచి 2024 (జూన్) మధ్య కాలంలో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలను నమోదు చేసింది. దీంతో సిటీలో 9 చోట్ల డబ్ల్యూహెచ్​వో నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఓజోన్ విష వాయువులున్నట్టు తేలింది. డబ్ల్యూహెచ్​వో ప్రమాణాల ప్రకారం ఒక క్యూబిక్ మీటర్ గాలిలో ఓజోన్ వాయువు100 మైక్రోగ్రాములలోపు ఉంటేనే సేఫ్. కానీ, హైదరాబాద్ లోని 9 చోట్ల 100 నుంచి 150 మైక్రోగ్రాముల వరకు ఓజోన్ స్థాయిలున్నట్టు స్టడీలో వెల్లడైంది. 

ఏటా పెరుగుతున్న ఎఫెక్ట్

సాధారణంగా అయితే ఓజోన్ వాయువు త్వరగానే గాలిలో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన కాలుష్యం కారణంగా గాలిలో ఓజోన్ ఎక్కువ రోజులపాటు అలాగే ఉండిపోతోందని కూడా స్టడీలో తేల్చారు. ఆయా చోట్ల ఒక ఏడాదిలో దాదాపు 86 రోజులపాటు ఓజోన్ వాయువు ప్రభావం ఉంటున్నట్టు నిర్ధారించారు. 

అయితే, సిటీలోని ప్రాంతాన్ని బట్టి ఓజోన్ వాయువు గ్రౌండ్​లెవెల్ వాతావరణంలో ఉంటున్న రోజుల సంఖ్య మారుతున్నట్టుగా గుర్తించారు. పరిశ్రమలు, కాలుష్యం ఎక్కువున్న చోట అది ఎక్కువగా ఉంటున్నదని చెప్తున్నారు. ఉదాహరణకు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న సనత్​నగర్, ఇక్రిశాట్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ఓజోన్ వాయువు గాలిలో ఎక్కువగా ఉంటున్న రోజుల సంఖ్య 50 నుంచి 86 రోజుల వరకు ఉందని స్టడీలో తేలింది. 

2020 నుంచి చూస్తే ఏటా ఈ విష వాయువు గాలిలో ఉండే రోజుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడైంది. 2020లో 19 రోజులు, 2021లో 26 రోజులు, 2022లో 98 రోజులు, 2023లో 84 రోజుల పాటు ఓజోన్ వాయువు వాతావరణంలో ఎక్కువ స్థాయిల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది జులై 18నాటికే.. 84 రోజుల పాటు గాలిలో ఓజోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. అంటే ఆరున్నర నెలల్లో దాదాపు మూడు నెలల పాటు ఓజోన్ ప్రభావం తీవ్రంగా ఉందని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సనత్​నగర్​లో అత్యధికం  

ఓజోన్ స్థాయిలు అధికంగా రికార్డ్ అవుతున్న ప్రాంతాల జాబితాలో సనత్​నగర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అక్కడ ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 150.9 మైక్రోగ్రాముల మేరకు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఉందని రీసెర్చర్లు తేల్చారు. ఇక్రిశాట్​లో 145.9, ఈసీఐఎల్​లో 140.8, రామచంద్రాపురంలో 129.1, ఐఐటీహెచ్​లో 121.3, కొంపల్లిలో 118.1, న్యూ మలక్​పేట్​లో 112, జూపార్క్​లో 111, సోమాజిగూడలో 100.6 మైక్రోగ్రాముల చొప్పున ఓజోన్ స్థాయిలున్నట్టు స్టడీలో గుర్తించారు. 

అతి తక్కువగా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఒక క్యూబిక్​ మీటర్ గాలిలో కేవలం 4.6 మైక్రోగ్రాముల ఓజోన్ మాత్రమే ఉన్నట్టు కనుగొన్నారు. ఇక పాషా మైలారంలో 19.9, కోకాపేట్​లో 27 మైక్రోగ్రాములు చొప్పున ఓజోన్ స్థాయిలు ఉన్నట్టు వెల్లడైంది. 

ఏంటీ గ్రౌండ్ లెవెల్ ఓజోన్?

భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్​గా ఉత్పత్తి కాదు. వాహనాలు, ఫ్యాక్టరీలు, విద్యుదుత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (బెంజీన్, ఇథిలీన్ గ్లైకాల్, ఫార్మాల్డిహైడ్, జైలీన్ వంటి హైడ్రోకార్బన్స్) కలిసి చర్యలు జరిగితే ఓజోన్ తయారవుతుంది. ప్రత్యేకించి సూర్యుడి ఎండలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపై గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. 

అందుకే వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అయితే, ఇది ఉత్పత్తి అయిన చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకూ విస్తరిస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. దీనిని ట్రాక్​ చేయడంగానీ, ప్రభావాన్ని తగ్గించడంగానీ చాలా కష్టంతో కూడుకున్నదని అంటున్నారు. 

లంగ్స్​కు చాలా ప్రమాదం

సాధారణంగా భూమిపై 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్​లో ఉంటే ఓజోన్ వాయువు ఒక పొరలాగా మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది. కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ గా పని చేసి వేడిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా.. మనుషులకు, జంతువులకు, మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది. ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చినవారికి ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. 

సమస్యలు మరింత తీవ్రమైతే బ్రాంకైటిస్ (శ్వాసనాళాల వాపు), ఎంఫీసిమా(ఊపిరితిత్తుల వాపు), ఆస్తమా వంటి వాటికీ దారి తీస్తుందని అంటున్నారు. ‘‘ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువును పీలిస్తే గనక ఊపిరితిత్తుల కణజాలం (లంగ్ టిష్యూ) దెబ్బతింటుంది. మళ్లీ మళ్లీ అధిక స్థాయిల్లో ఓజోన్ బారిన పడితే.. లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పని చేసే కార్మికులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రిపూటా పెరుగుతున్నయ్

సాధారణంగా రాత్రి కాగానే ఓజోన్ స్థాయిలు పడిపోతుంటాయి. కానీ తాజా అధ్యయనంలో మాత్రం పెరిగిపోతున్నట్టుగా రీసెర్చర్లు గుర్తించారు. అత్యధికంగా ఐఐటీహెచ్ కంది వద్ద 29 రాత్రుళ్ల పాటు ఓజోన్ స్థాయిలు 100  మైక్రోగ్రాములకన్నా ఎక్కువగా రికార్డ్ అయినట్టు తేల్చారు. ఇండస్ట్రియల్ ఏరియాలైన సనత్​నగర్, ఇక్రిశాట్, కొంపల్లి ప్రాంతాల్లోనూ నైట్ టైంలోనూ ఓజోన్ ప్రభావం అలాగే ఉందని నిర్ధారించారు. అలాగే సనత్​నగర్​లో 20 రాత్రులు, కొంపల్లిలో 18, ఇక్రిశాట్​లో 10, ఆర్సీపురం, సోమాజిగూడలో 9 రాత్రుళ్ల చొప్పున నైట్ టైంలో ఓజోన్ స్థాయిలు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్టు కనుగొన్నారు.