
US Recession: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, సంస్థలు చెబుతోంది ఒక్కటే ద్రవ్యోల్బణం పెరుగుతుందని. వాస్తవానికి కరోనా తర్వాత మాంద్యం అంచుల వరకు వెళ్ళిన అమెరికా ఎట్టకేలకు తిరిగి గాడిన పడటం స్టార్ట్ చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావటంతో తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ బెర్న్‌స్టెయిన్ విశ్లేషకులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు తీసుకొచ్చారు. ఒకవేళ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తే దానివల్ల భారత్ ప్రయోజనం పొందుతుందని పేర్కొంది. ఆర్థిక స్థితిస్థాపకత, బలమైన దేశీయ డిమాండ్ వంటి అంశాలు ఇండియాకు కలిసొస్తాయని పేర్కొంది. 2024లో జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశ ఈక్విటీ మార్కెట్లపై బ్రోకరేజ్ సానుకూలంగా మారింది. అలాగే భారత స్థూల ఆర్థిక పునరుద్ధరణ ఇప్పటికే ప్రారంభమైందని కూడా సందరు సంస్థ పేర్కొంది.
చారిత్రాత్మకంగా అమెరికా-ఇండియా ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే.. యూఎస్ ఆర్థికంగా మాంద్యంలోకి జారుకున్న సమయంలో కూడా ఇండియా తన గ్రోత్ జర్నీని కొనసాగించినట్లు బెర్న్‌స్టెయిన్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. బయటి నుంచి ప్రతికూల గాలులు వీస్తున్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగగలదని నొక్కి చెప్పింది. అయితే దీనికి ముందు సెప్టెంబర్ త్రైమాసికంలో భారత వృద్ధి మందగించటం మనం గమనించాం. ఇండియా సైతం దీనిని సరిదిద్దేందుకు అనేక సంస్కరణలను తీసుకొస్తోంది. ప్రజల చేతిలో వినియోగానికి డబ్బును పెంచుతూ డిమాండ్ ప్రేరేపించటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.
ఈ క్రమంలో ఇండియా నుంచి ఫార్మా, ఐటీ సేవలు, జ్యూవెలరీ, పెట్రోలియం ఉత్పత్తులు వంటి కీలక ఎగుమతులు అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి సాపేక్షంగా సురక్షితంగా ఉన్నాయని వెల్లడైంది. ఆటో విడిభాగాలు, టెక్స్ టైల్ కొంత ప్రభావాన్ని చూపినప్పటికీ.. మెుత్తం భారత ఎగుమతుల్లో వాటి వాటా విస్తృత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేయడానికి చాలా తక్కువగా ఉండటం తక్కువ ప్రభావాన్ని సూచిస్తోంది. అలాగే గత ఆరు నెలలుగా భారత మార్కెట్లపై ఒత్తిడి తెచ్చిన విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రస్తుతం మందగించినట్లు కనిపిస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం క్రూడ్ ఆయిల్, రాగి, అల్యూమినియం, స్టీల్ వంటి కమోడిటీస్ ధరల తగ్గుదలకు దారితీసి భారత దిగుమతుల బిల్లును తగ్గించటానికి దోహదపడనుంది. ఇప్పటి వరకు కొన్ని వారాలుగా కరెక్షన్ చూస్తున్న భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రికవరీకి సిద్ధంగా ఉందని బెర్న్‌స్టెయిన్ వెల్లడించింది. మెుత్తానికి ప్రపంచ వాణిజ్యంలోని ప్రతికూలతల ప్రభావం ఇండియాపై పరిమిత స్థాయిల్లోనే ఉంటుందని బెర్న్‌స్టెయిన్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సహాయపడనున్నాయి.