కరీంనగర్, వెలుగు: కరీంనగర్జిల్లాను మూడు రోజులుగా ముసురు వదిలిపెట్టడం లేదు. ఈ సీజన్ లో గురువారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామడుగు మండలంలో 154.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. గంగాధర 105 మిల్లీమీటర్లు, చొప్పదండిలో 49, కరీంనగర్ సిటీలో 43, రూరల్ మండలంలో 33 మి.మీ. వర్షపాతం నమోదైంది. కరీంనగర్ సిటీలో రాత్రి సుమారు గంట సేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో ముకరంపుర, జ్యోతినగర్, రాంనగర్, విద్యానగర్, బస్టాండ్, కలెక్టరేట్ రోడ్డు, తిరుమల నగర్ ఏరియాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో గత మూడు రోజులుగా వర్షం కురుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు 30.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త తెరిపిచ్చిన వాన.. మళ్లీ సాయంత్రం మొదలైంది. . కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అత్యధికంగా 51.7 మి.మీ., అత్యల్పంగా కమాన్‌పూర్ మండలంలో 12.1 మి.మీల వర్షపాతం నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి ఎగువ నుంచి వరద పెరుగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం15.3779 టీఎంసీల నీటి మట్టం ఉంది. 6, 378 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది.