హన్మకొండ జిల్లా పరకాలలో ఘటన
పరకాల, వెలుగు : హన్మకొండ జిల్లా పరకాల సబ్‌జైలు నుంచి ఓ రిమాండ్‌ఖైదీ పారిపోగా.. జైలు సిబ్బంది అతడిని ఎనిమిది గంటల్లో పట్టుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన ఎస్కే గౌస్‌పాషా పోక్సో కేసులో మార్చి 18న సబ్‌జైలుకు రిమాండ్‌ఖైదీగా వచ్చాడు. సోమవారం ఉదయం జైలులోని చెత్తను మున్సిపాలిటీ ట్రాక్టర్లో పోసేందుకు జైలు సిబ్బంది.. గౌస్‌పాషాతో పాటు మరో ఖైదీని బయటకు తీసుకువచ్చారు. జైలు బయట సిబ్బందితో కలిసి ట్రాక్టర్లో చెత్త పోస్తున్న గౌస్‌పాషా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన జైలు సిబ్బంది అతడి వెంటపడినా లాభం లేకుండా పోయింది. సబ్‌జైలర్ ప్రభాకర్‌కు సమాచారం అందించగా ఆయన పోలీసులు, వరంగల్ జైలు ఉన్నతాధికారులకు విషయం చేరవేశారు.
పోలీసులు, జైలు అధికారులు గ్రూపులుగా విడిపోయి గౌస్‌పాషా కోసం వెతికారు. ఎనిమిది గంటలు వెతికిన తర్వాత జైలుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డిపల్లి శివారు లలిత కన్వెన్షన్ హాలు ఎదురుగా ఉన్న పంటపొలాల్లో ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నారు. తర్వాత సబ్‌జైలుకు తరలించారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం, రిమాండ్ఖైదీని బయటకు తీసుకురాకూడదని నిబంధనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.