ఫారెస్ట్ ఏరియాలో వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు. దాదాపు 42 గంటలకు పైగా రాళ్ల మధ్యలోనే ఉండిపోయాడు. బాధితుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. యువకుడిని కాపాడేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాజు కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కోట్లాది మంది ప్రార్థనలు ఫలించి... రాజు క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..!
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు అనే వ్యక్తి తరచూ ఫారెస్టు ఏరియాలో వేటకు వెళ్తుంటాడు. ఉడుములు, ఇతర చిన్నపాటి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈనెల 13వ తేదీన (మంగళవారం) మధ్యాహ్నం రాజు వేటకు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వెళ్లాడు. ఫారెస్ట్ కు వెళ్లిన రాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా అతడి సెల్ ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం ఇరుక్కుపోగా.. బుధవారం గుర్తించారు.
అయితే.. రాత్రి అయినా రాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. చాలామందిని అడిగారు. ఎవరి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో రాజును వెతుక్కుంటూ ఫారెస్టు ఏరియా లోపలికి వెళ్లారు. తరచూ రాజు తిరిగే ప్రాంతాల్లో గాలించారు.
షాక్ లో కుటుంబ సభ్యులు
ఇదే క్రమంలో సింగరాయిపల్లి శివారులోని పెద్ద రాళ్ల గుట్ట మధ్యలో నుంచి అరుపులు వినిపించడంతో రాజు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. లోపలి నుంచి అరుస్తున్న వ్యక్తిని రాజుగా గుర్తించారు. రాళ్ల మధ్య సందులో ఇరుక్కుపోయిన రాజును చూసి కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. కేవలం కాళ్లు మాత్రమే బయటకు కనిపించాయి. రాజును బయటకు తీసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. తాగేందుకు పైనుంచి రాజుకు నీళ్లు పోశారు.
ఘటనాస్థలానికి రెస్క్యూ టీమ్
విషయం తెలియగానే ఘటనా స్థలానికి పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్ఆఫీసర్లు, సిబ్బంది చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. రాళ్లగుట్ట పక్కన జేసీబీతో తవ్వారు. రాత్రి 12 గంటల వరకు కూడా బయటకు తీయలేకపోయారు. ప్రస్తుతం కూడా రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. రాజుకు తాగేందుకు వాటర్ అందిస్తున్నారు.
వేగంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇవాళ ఉదయం నుంచి రాజును కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద బండను తొలగించేందుకు కంప్రెసర్ బ్లాస్ట్ చేశారు. అయితే.. రాజు బయటకు వచ్చేందుకు మరో పెద్ద బండ రాయి అడ్డుగా ఉంది. ప్రస్తుతం దాన్ని తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అతడి ఫ్రెండ్ అశోక్ ను బండ రాళ్ల మధ్యలోకి పంపించారు. తాగునీరు, కొన్ని ఫ్రూట్స్ ను రాజుకు ఇచ్చి వచ్చాడు అశోక్. రాజుతో మాట్లాడాడు. బండ రాళ్ల మధ్యలో ఉన్న రాజుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 15 గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు
మరోవైపు రాజు ఎప్పుడు బయటకు వస్తాడా..? అని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారికి పోలీసులు, బంధువులు ధైర్యం చెబుతున్నారు. రాజు క్షేమంగా బయటకు వస్తాడని హామీ ఇస్తున్నారు.
రాజుకు గాయాలు
రాజు ఫ్రెండ్ అశోక్ చెప్పిన వివరాల ప్రకారం.. రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన రాజుతో మాట్లాడానని అశోక్ వెల్లడించాడు. ‘స్వతహాగా నేను రాలేను. ఒకవేళ నేను బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తే నా బాడీకి తీవ్ర గాయాలు కావొచ్చు. నన్ను ఎలాగైనా కాపాడండి’ అని తనతో రాజు చెప్పినట్లు అశోక్ తెలిపాడు. రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన రాజుకు పలుచోట్ల తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించానని చెప్పాడు. మరో గంట సమయంలో రాజు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నాడు.
ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా.. కంట్రోల్ బ్లాస్ట్ (లెటెస్ట్ టెక్నాలజీ) చేశారు. కంట్రోల్ బ్లాస్ట్ అంటే.. రాళ్లను బ్లాస్ట్ చేసినప్పుడు అవి ఎగిరిపడకుండా ఉన్నచోటనే విరిగిపోయేలా చేసే ప్రక్రియ. పరిమిత సంఖ్యలో మందు గుండు సామాగ్రిని వాడుతారు. ఇప్పటికే రెండు బ్లాస్ట్ లు చేశారు.
రాజుకు ఏమీ కాదని, బయటకు క్షేమంగా వస్తాడని అశోక్ ధీమా వ్యక్తం చేశాడు. తప్పనిసరిగా బయటకు వస్తాడని చెప్పాడు. మరోవైపు.. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక పెద్ద బండ రాయిని తొలగిస్తే రాజును సురక్షితంగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు.