జనగామ, వెలుగు : తడిసిన ప్రతి గింజను కొంటామని, రైతులు అధైర్యపడొద్దని స్టేట్ సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. బుధవారం జనగామ కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 8 లక్షల టన్నుల వడ్లు కొన్నట్లు తెలిపారు. సెంటర్ల నుంచి వడ్లను మిల్లులకు తరలించడంతో పాటు రైతు అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యే వరకు ఆఫీసర్లు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వడ్ల కొనుగోళ్లలో కోతలు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హమాలీలను ఎక్కువ సంఖ్యలో నియమించుకొని వడ్ల బస్తాలను వెంట వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు పెంబర్తి, నెల్లుట్లలోని కొనుగోలు కేంద్రాలతో పాటు, జనగామ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ భాస్కర్‌రావు, సివిల్ సప్లై జిల్లా ఆఫీసర్ రోజా రాణి, జిల్లా మేనేజర్ ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేంద్ర, అగ్రికల్చర్ ఆఫీసర్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.