ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు!

ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు!
  •      ఇప్పటికే మూడు కొత్త జాతీయ రహదారుల నిర్మాణం 
  •      మూడు రోడ్లను కలిపేందుకు తాజాగా లింక్​ రోడ్డు ఏర్పాటు 
  •      రూ.125 కోట్లతో 6.5 కిలోమీటర్ల రహదారికి ఎన్​హెచ్​ అప్రూవల్

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు కాబోతున్నది. ఇప్పటికే నగరం చుట్టూ కొత్తగా మూడు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. వీటి కారణంగా నగరానికి మూడు వైపులా రింగ్ రోడ్డు రూపంలో ఫార్మేషన్​ జరుగుతోంది. ఈ మూడు రోడ్లను కలిపేందుకు మరో ఆరున్నర కిలోమీటర్ల మేర లింక్​ అవసరం కాగా, తాజాగా ఆ రోడ్డుకు కూడా నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా అనుమతిచ్చింది. 2024, 25 సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లాలో ఆరు రహదారుల కోసం రూ.654.86 కోట్ల పనులకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. 

ఇందులోనే ఎన్​.హెచ్​.365 (ఏ), ఎన్​హెచ్​ 163 (జీ) మధ్య లింక్​ రోడ్డుకు రూ.125 కోట్లకు అప్రూవల్ ఇచ్చింది. రెండు, మూడు నెలల్లోనే పూర్తి స్థాయి డీపీఆర్​ ను సిద్ధం చేసి, టెక్నికల్ శాంక్షన్​ తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లను పిలుస్తారు. వేగంగా పనులు జరుగుతుండడంతో మరో ఏడాదిలోగా మూడు జాతీయ రహదారులు పూర్తి కానుండగా, తాజాగా మంజూరైన లింక్​ రోడ్డు పనులు కూడా పూర్తయితే మరో రెండేళ్లలోనే ఖమ్మం చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటుకానుంది. నగరంలోని ట్రాఫిక్​తో సంబంధం లేకుండా ఈ రింగ్ రోడ్డు గుండానే త్వరగా జర్నీ చేసే వీలు కలగనుంది. 

మూడు వైపులా నాలుగు లేన్ల రోడ్లు.. 

ఖమ్మం నగరం మీదుగా సూర్యాపేట, దేవరపల్లి జాతీయ రహదారిని రూ.2,200 కోట్లతో నిర్మిస్తున్నారు. నాగ్​ పూర్, విజయవాడ జాతీయ రహదారిని రూ.6,700 కోట్లతో నిర్మిస్తున్నారు. కోదాడ, కొరివి జాతీయ రహదారిని రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటి కారణంగా మూడు వైపులా నాలుగు లేన్ల జాతీయ రహదారులు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయి. ఖమ్మం నగరానికి ఉత్తరభాగంలో కేవలం ఆరున్నర కిలోమీటర్లను కొత్త రోడ్ల మధ్య లింక్​ చేయడం ద్వారా ఇప్పుడు రింగ్ రోడ్​ రూపుదిద్దుకోబోతోంది. 

వాస్తవానికి ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి ముందే ఖమ్మం నగరానికి ఔటర్​ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. బీఆర్ఎస్​ మొదటి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ఆర్​ అండ్​ బీ మినిస్టర్​ గా ఉన్న సమయంలో రూ.180 కోట్లతో మంజూరు చేశారు. అప్పట్లో నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి గ్రీన్​ సిగ్నల్​ రాక పెండింగ్ లో పడింది. ఆ తర్వాత కొత్తగా జాతీయ రహదారులు ఏర్పాటు కావడంతో వాటిని ఉపయోగించుకుంటూ రింగ్ రోడ్డు ను ఏర్పాటు చేసేలా ప్లాన్​ వేశారు. 

సర్వీస్​ రోడ్లు కూడా ప్రపోజ్ చేస్తున్నాం

ఖమ్మం నగరం చుట్టూ రింగ్ రోడ్డు ఉండాలని గతంలో ఆర్​ అండ్​ బి మంత్రిగా ఉన్న సమయంలోనే రూ.180 కోట్లతో మంజూరు చేశాం. నిధుల సమస్య కారణంగా అప్పుడు ఏర్పాటుకాలేదు. జాతీయ రహదారుల కారణంగా ఇప్పుడు రింగ్ రోడ్డు ఏర్పాటవుతుండడం సంతోషంగా ఉంది. రింగ్​రోడ్డు చుట్టూ సర్వీస్​ రోడ్లు ఉంటేనే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్డు పక్కన హ్యాబిటేషన్లు ఉంటేనే ఎన్​హెచ్​ అధికారులు సర్వీస్​ రోడ్డు మంజూరు చేస్తారు. ముందైతే సర్వీస్​ రోడ్లకు ప్రపోజల్స్ పంపించాలని అధికారులకు సూచించాను.
- తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి