ఓవర్ స్పీడ్ తో బైక్ పై వెళ్లి కారును ఢీకొట్టారు..ఒకరి పరిస్థితి విషమం

నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల, మద్యం తాగి బండ్లు డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు టూవీలర్ పై అతివేగంతో ఉప్పల్ నుంచి అంబర్ పేట రోడ్డు వైపునకు వెళ్తున్నారు. ఓవర్ స్పీడ్ తో వెళ్తూ కారును ఢీకొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు కిందపడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై 108కు ఫోన్ చేసి, ఆస్పత్రికి పంపించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అంబర్ పేట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.