డీసీఎం ఢీకొని నలుగురు మృతి

  • డీసీఎం ఢీకొని నలుగురు మృతి
  • లారీని బస్సు ఢీకొట్టడంతో చూసేందుకు కిందికి దిగిన ప్రయాణికులు
  • వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం
  • నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద ఘటన

ఇందల్వాయి, వెలుగు :  నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయాన్​పల్లి వద్ద ఎన్​హెచ్ 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి లారీని బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీన్ని చూసేందుకు బస్సులోని ప్రయాణికులు కిందికి దిగారు. అంతలోనే వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవాళ్లంతా యూపీకి చెందినవాళ్లని ఇందల్వాయి ఎస్ఐ మహేశ్ తెలిపారు. శుక్రవారం రాత్రి 50 మందితో హైదరాబాద్ నుంచి యూపీకి బస్సు బయలుదేరింది.

చంద్రయాన్​పల్లి వద్దకు రాగానే ముందు ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు దెబ్బతినగా.. డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. ఎంత డ్యామేజ్ అయిందో చూసేందుకు బస్సులో ప్రయాణిస్తున్న ప్రదీప్ (40), గణేశ్ (29), జీతు (32), దుర్గేశ్ ప్రసాద్ కిందికి దిగారు. బస్సు పక్కన నిలబడి ఉండగా.. వీరిని వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో ప్రదీప్, జీతు స్పాట్​లోనే చనిపోయారు. గణేశ్, దుర్గేశ్ ప్రసాద్ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రదీప్ సొదరుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ వివరించారు. ప్రమాదానికి కారణమైన బస్సు, డీసీఎంలను పీఎస్​కు తరలించారు.