బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీషీట్

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లోని 21వ డివిజన్ బీఆర్ఎస్  కార్పొరేటర్  జంగిలి సాగర్ పై పోలీసులు రౌడీషీట్  నమోదు చేశారు. ఇటీవల రిటైర్డ్  టీచర్  లింగారెడ్డిని రూ.40 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేయగా సాగర్ ను కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం జైలులో జ్యుడీషియల్  రిమాండ్ లో ఉన్న సాగర్ పై గతంలో మరో నాలుగు భూకబ్జా కేసులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్  తెరిచామని పోలీసులు వెల్లడించారు.

కరీంనగర్  రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూమిలోకి చొరబడి గణేశుడి విగ్రహం పెట్టి టెంట్లు వేశారని 2011లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తపల్లి పోలీస్ స్టేషన్  పరిధిలో ఒకరి ఇంటి ప్రహరీని  కూల్చివేశారని ఫిర్యాదు రావడంతో  2022లో కేసు నమోదైంది. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్, అతడి అనుచరులు కలిసి నిర్మాణంలో ఉన్న ఇతరుల ఇంటిని కూల్చివేసినందుకు 2022లో కేసు బుక్ అయింది. ఇటీవల రిటైర్డ్ టీచర్ లింగారెడ్డిని బెదిరించి రూ.‌‌లక్ష వసూలు చేయడంతో పాటు ఆయన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినందుకు కొత్తపల్లి పోలీసులు కేసు బుక్  చేశారు.