వికారాబాద్ మున్సిపల్ సమావేశంలో రగడ

వికారాబాద్ మున్సిపల్ సమావేశంలో రగడ
  • మున్సిపల్ అత్యవసర సమావేశంలో రచ్చ రచ్చ

వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ అత్యవసర సమావేశంలో రగడ చోటు చేసుకుంది. చైర్ పర్సన్ మంజుల పదవి నుంచి దిగిపోవాలంటూ టీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. చైర్ పర్సన్ పదవి టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని, ఎవరూ కలగజేసుకోవద్దని చెప్పి, ఇవాళ మున్సిపల్ సమావేశంలో నిరసన తెలియజేయడం ఏంటని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కుర్చీ పంచాయతీ గురించి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతారా..? అంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తప్పుపట్టారు. ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్ పర్సన్ మంజుల అధ్యక్షతన గణేష్ నిమజ్జనం రోజున చేపట్టే కార్యక్రమాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎజెండా తీర్మానం సమావేశం అయిపోయిన అనంతరం టీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలియజేశారు. 

ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తైనా పదవి నుంచి ఎందుకు దిగిపోవడం లేదని టీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ మంజులను నిలదీశారు. సమావేశంలోనే ప్లకార్డులతో నిరసన తెలియజేడంతో చైర్ పర్సన్ మంజుల సమావేశాన్ని వాయిదా వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్ కుర్చీ పంచాయతీ ఏంటని కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ ఏడాది జులై27న రెండున్నరేళ్ల గడువు ముగియడంతో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వినిపిస్తున్న విషయం తెలిసిందే.