లైసెన్స్ రెన్యువల్ కావాలంటే..సిరిసిల్ల పోవాల్నట!
హెవీ వెహికల్ డ్రైవర్లకు సర్కారు ఆదేశం
ఐడీటీఆర్‌లో ఒక్క రోజు శిక్షణ
ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటేనే లైసెన్స్ రెన్యువల్
రవాణా శాఖ జీవోపై డ్రైవర్ల మండిపాటు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కారు పెట్టిన ఓ రూల్ హెవీ వెహికల్ డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారింది. డ్రైవర్లందరూ ఒక్కరోజు ‘రిఫ్రెషర్ డ్రైవింగ్ ట్రైనింగ్’ తీసుకోవాలని జీవో విడుదల చేసింది. ఈ నెల 3న రిలీజ్ చేసిన ఆ జీవో కాస్తా వివాదాస్పదమైంది. దానికి కారణం.. ఒక్క రోజు శిక్షణ కోసం రాష్ట్రంలోని డ్రైవర్లంతా సిరిసిల్లకు పోవాలనడమే.. దీనిపై డ్రైవర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లైసెన్స్ రెన్యువల్ కావాలంటే ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టడంపై డ్రైవర్లు మండిపడుతున్నారు.
ఏంటా జీవో?
2021లో సిరిసిల్ల కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడీటీఆర్)ను సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ లారీలు, ట్రక్కులు, బస్సుల వంటి భారీ వాహనాల డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ఐడీటీఆర్ ముఖ్య ఉద్దేశం. లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన డ్రైవర్లంతా ఒక్కరోజు ట్రైనింగ్ కు హాజరు కావాలని రవాణా శాఖ ఈ నెల 3న జీవో జారీ చేసింది. అన్ని జిల్లాల డ్రైవర్లూ ఐడీటీఆర్‌లో శిక్షణ తీసుకునేలా ఆ జిల్లా రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. ఆర్టీఏ సెక్రటరీ, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆర్టీవోలకు ఈమేరకు సర్క్యులర్ పంపించింది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డ్రైవర్లు
రవాణ శాఖ జారీ చేసిన జీవోను హెవీ వెహి కల్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. ఒక్కరోజు డ్రైవింగ్ ట్రైనింగ్ దేనికని ప్రశ్నిస్తున్నారు. మారు మూల ప్రాంతాల డ్రైవర్లు కూడా ఒక్కరోజు శిక్షణ కోసం సిరిసిల్ల వరకు రావాల్నా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్‌లో అనుభవం ఉంటేనే లైసెన్స్ రెన్యువల్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. అలాంటి వాళ్లకు మళ్లీ ట్రైనింగ్ దేనికని ప్రశ్నిస్తున్నారు. ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉం టేనే లైసెన్స్ రెన్యువల్ చేస్తామనడం సరికాదని అంటున్నారు. దీనిపై రవాణ శాఖ అధికారులు స్పందించారు. రాష్ట్రంలోని డ్రైవర్లంతా అక్కడకు హాజరుకావాల్సిన అవసరం లేదని, కేవలం కరీంనగర్ జిల్లాకు చెందిన డ్రైవర్లు అటెండ్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన సవరించిన జీవో మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు.