హైదరాబాద్ : దేవరకద్ర టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ సర్పంచ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేతో పాటు కొత్తకోట ఎస్సై, ఎంపీడీవో పై కూడా చర్యలు తీసుకోవాలని ఆ సర్పంచ్ కోరాడు. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ తో కలిసి బాధిత సర్పంచ్ HRC కి ఫిర్యాదు చేశాడు. తమ గ్రామంలో నిర్వహించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక పోలీసులు తనను ఈడ్చుకుంటూ వెళ్లారని బాధిత సర్పంచ్ పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే...
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామానికి విశ్వనాధం సర్పంచ్ గా ఉన్నాడు. అయితే ఇటీవల నిర్వేన్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. లబ్దిదారులకు ఆసరా పింఛన్లు అందజేశారు. అయితే స్థానిక సర్పంచ్ గా ఉన్న తనను ఆ కార్యక్రమానికి పిలవలేదని, ప్రోటోకాల్ విషయమై ప్రశ్నిస్తే తనను ఈడ్చుకుంటూ వెళ్లారని బాధిత సర్పంచ్ విశ్వనాధం కన్నీటి పర్యంతమయ్యాడు. ఓ సర్పంచ్ గా ప్రోటోకాల్ విషయమై ప్రశ్నించిన తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. ఆసరా పింఛన్ల కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేస్తే.. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి అక్కడ పాల్గొనకుండా పార్టీ కార్యకర్తల మీటింగ్ లో పింఛన్లు పంపిణీ చేశారని ఆరోపించారు. ఇదే విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు పోలీసులు తనను అరెస్ట్ చేసి తీవ్రంగా అవమానించారని చెప్పారు. ప్రశ్నిస్తే గ్రామ సర్పంచ్ ను అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు. తాను అధికార పార్టీ సర్పంచ్ కాకపోవడం వల్లనే ఎమ్మెల్యే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన విధులకు భంగం కలిగించడమే కాకుండా తన కుటుంబ సభ్యులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని వాపోయారు. ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తకోట ఎస్సై, ఎంపీడీవో వల్ల తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందన్న బాధితుడు... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరాడు.