కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. సెయింట్ ఆంథోనీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మారం శ్రీకర్ అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ ఆవరణలో ఉన్న బావిలో చెత్తను క్లీన్ చేయమని వార్డెన్ విద్యార్థులకు చెప్పారు. వార్డెనే స్వయంగా నలుగురు విద్యార్థులను బావిలోకి దింపారు. బావిలోకి దిగిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఈత రాకపోవడంతో శ్రీకర్ అనే విద్యార్థి బావిలో మునిగిపోయి మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది శ్రీకర్ మృతదేహాన్ని వెలికితీశారు.
ఇక విద్యార్థులను బావిలోకి దింపిన స్కూల్ వార్డెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో ఇలాంటి పనులు ఎలా చేయిస్తారని స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. సంఘటనా స్థలంలో మృతుడి తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల రోదనలు మిన్నంటాయి.