తోటి సిబ్బందిని చంపి పోలీసులకు లొంగిపోయిన సెక్యూరిటీ గార్డు

  •     శామీర్​పేటలోని లాల్​గడి మలక్​పేటలో ఘటన

శామీర్ పేట, వెలుగు: రోజూ తాగి సతాయిస్తుండని ప్రవేటు కంపెనీలో పనిచేసే సెక్యూరిటీ గార్డును.. మరో సెక్యూరిటీ గార్డు హత్య చేసిన ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. అస్సాంకు చెందిన ప్రొబిన్ బోరా(41), ఉత్తరప్రదేశ్​కు చెందిన అచ్చేలాల్ గుప్తా(43) ఇద్దరూ ఏడాది కాలంగా శామీర్ పేట మండలం లాల్ గడి మలక్​పేటలోని హైటెక్ సీడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒకే రూమ్​లో ఉంటున్నారు. ప్రొబిన్ ప్రతిరోజూ తాగొచ్చి అచ్చేలాల్​ను తిట్టేవాడు. మందు కావాలని సతాయించేవాడు. షిఫ్ట్​ల విషయంలోనూ సహకరించకుండా వేధించేవాడు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

తాగొచ్చిన ప్రొబిన్ కత్తితో అచ్చేలాల్​ను బెదిరించాడు. తర్వాత ప్రొబిన్ నిద్రపోయాడు. ప్రొబిన్ తాగొచ్చి వేధిస్తుండటంతో అతడిని హత్య చేయాలని అచ్చేలాల్ డిసైడ్ అయ్యాడు. అదే రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న ప్రొబిన్​ను.. కత్తితో గొంతు కోసి చంపాడు.  దగ్గరలోని వ్యవసాయ బావిలో డెడ్ బాడీ పడేశాడు. తర్వాత అచ్చేలాల్ శామీర్ పేట పీఎస్​లో లొంగిపోయాడు. సోమవారం ఉదయం పోలీసులు ప్రొబిన్ డెడ్​బాడీని బావిలో నుంచి బయటికి తీయించారు. డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన సామగ్రిని క్లూస్ టీమ్ సీజ్ చేసింది. అచ్చేలాల్​ను రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.