- వంద అడుగుల లోయలో పడిపోయిన యువతి
- మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘటన
పుణె: సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ ఓ యువతి వంద అడుగుల లోయలో పడిపోయింది. తర్వాత స్థానికులు, పోలీసులు కలిసి తాళ్ల సాయంతో ఆమెను అతి కష్టం మీద పైకి తీసుకొచ్చారు.తర్వాత హాస్పిటల్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చెందిన కొందరు ఫ్రెండ్స్ కలిసి టూర్‌కు బయలుదేరారు.
ఆదివారం ఉదయం సతారా జిల్లాలోని బోర్నే ఘాట్‌కు చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి థోస్‌గర్ జలపాతం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో వారిలో ఒకామె నస్రీన్ అమీర్ ఖురేషీ(29) కొండ చివరన సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న వంద అడుగుల లోయలో పడిపోయింది. స్థానికులతో పాటు ఆమె ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ట్రెక్కర్స్, హోంగార్డ్ తాళ్ల సహాయంతో కిందికి దిగారు.
ఆమెను అతి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. నొప్పితో ఏడుస్తూ.. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే సతారాలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు.. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. హెల్త్ కండీషన్ స్టేబుల్‌గానే ఉందని, ట్రీట్మెంట్ చేస్తున్నామని వివరించారు. కొద్ది రోజులుగా సతారా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, టూరిస్టు ప్రాంతాలకు వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవద్దని తెలిపారు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని టూరిస్టు ప్రదేశాలను కొన్ని రోజులపాటు మూసివేస్తున్నట్లు సతారా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని రోజుల కింద రాయ్‌గఢ్‌లో 26 ఏండ్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కుంభే వాటర్ ఫాల్ ఉన్న లోయలో పడి చనిపోయింది.