చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: చేనేత వర్గాల చైతన్య వేదిక

ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రభుత్వానికి చేనేత రంగం, కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే చేనేతను జౌళి శాఖ నుంచి విడదీసి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాస్ డిమాండ్ చేశారు. ప్రత్యేక శాఖకు రూ. 2వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం చిక్కడపల్లి లోని రాష్ట్ర ఆఫీసులో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. 

దీనికి ముఖ్య అతిథిగా హాజరై న దేవదాసు​ మాట్లాడుతూ నేతన్నలకు ఉపాధి కల్పించడానికి మహిళ స్వయం శాఖ గ్రూపులో ఉన్న మహిళలకు ఏడాదికి రెండు చీరల చొప్పున ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇది చేనేత కార్మికులను మోసం చేయడమేనన్నారు. 

చేనేత సహకార సంఘాలకు 11 ఏండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా, పాలకవర్గాన్ని నియమించకుండా కాలయాపన చేయడం వల్ల సహకార సంఘాలు దెబ్బతిన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహించి, చేనేత కార్మికుల హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.