బొగ్గు బాయి బతుకులకు..భరోసా ఏది?

  •     సింగరేణిలో యాక్సిడెంట్ల గుబులు
  •     జిల్లాలోని బొగ్గు గనుల్లో వరుస ప్రమాదాలు
  •     ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి
  •     రక్షణ చర్యలపై యాజమాన్యం నిర్లక్ష్యం
  •     క్వాలిటీ పనిముట్లు ఇవ్వడంలేదంటున్న కార్మికులు

కోల్​బెల్ట్, వెలుగు : అనుభవజ్ఞులైన సూపర్​వైజర్లు ఉండరు.. అనుభవమున్న సీనియర్​ కార్మికులకు విధులు కేటాయించరు. పర్యవేక్షించే అధికారి కూడా అందుబాటులో ఉండరు.. ఉత్పత్తే లక్ష్యంగా ఉరుకులు, పరుగులు. ఈ రోజు ఎంత తోడాం? ఎంత తరలించాం..? అన్న ప్రశ్నలే తప్ప కార్మికుల భద్రత అసలే పట్టదు. ప్రమాదం జరిగాక బాధిత కుటుంబానికి ఎంతోకొంత ముట్టజెప్పి.. రెండు మూడు రోజుల్లోనే మళ్లీ ఉత్పాదక లెక్కల్లోకి జారుకోవటం.

సింగరేణిలో ఇది నిత్యం జరుగుతున్న వ్యవహారం. గనుల్లో పనిచేసే కార్మికుల రక్షణకు పూర్తిస్థాయి అండగా నిలిచే వ్యవస్థే కరవైంది. తప్పులను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా పరిష్కారం వెతికే ప్రయత్నమే లేదు. యాజమాన్యం అలసత్వం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు గాయాలపాలవుతుండగా కొద్దిరోజుల క్రితం ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. 

ఏడాది ప్రారంభంలోనే ఇద్దరి మృతి

సింగరేణిలో మళ్లీ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గినా ఈ ఏడాది ఆరంభం నుంచే మళ్లీ యాక్సిడెంట్లు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో సింగరేణి వ్యాప్తంగా ఐదుగురు కార్మికులు వివిధ ప్రమాదాల్లో మృత్యువాతపడగా 2024 ఆరంభంలో ఇద్దరు కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారు. కొంతకాలంగా అనుకోని ప్రమాదాలకంటే మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ కావడం యాజమాన్యాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. 2024 ఆరంభంలోనే నమోదైన ప్రమాదాల సంఖ్య చూస్తే మున్ముందు ఎలా ఉంటుందోనని కార్మికవర్గం భయపడుతోంది.

రామగుండం-1 ఏరియాలో ఒకరు చనిపోగా కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి స్టోర్స్​ వద్ద కర్రె రాజు మృత్యువాతపడ్డాడు. ఈనెల 16న కాసిపేట–2 గనికి చెందిన కర్రె రాజు, మరికొందరు కార్మికులు మందమర్రి స్టోర్స్​ వద్ద ఎస్కార్ట్​తో డబ్ల్యూ- స్ట్రప్స్ ఇనుప రేకులు లోడ్​ చేస్తుండగా స్ప్రింగ్​తాడు తెగి రేకులు మీద పడటంతో రాజు అక్కడికక్కడే చనిపోయాడు. నాసిరకం తాడు వినియోగించడం వల్లనే అది తెగిపోయింది.

మార్చి 21న శ్రీరాంపూర్​ఏరియా ఎస్సార్పీ-1 బొగ్గు గనిలో పుల్లి సరిచేస్తుండగా ప్రమాదానికి గురైన సాదం సత్యనారాయణ అనే కార్మికుడికి రెండు కాళ్లు పాదాల వరకు తెగిపోయాయి. పుల్లిపై సేఫ్టీ క్యాప్​ లేకపోవడం వల్ల కార్మికుడు తీవ్రగాయాలపాలయ్యాడు. మరుసటి రోజే శ్రీరాంపూర్​ఏరియా ఆర్కే7 గనిలో జరిగిన ప్రమాదంలో శివకుమార్​అనే కార్మికుడికి గాయాలయ్యాయి. ఇలా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతుంది. 

ఒక సూపర్​వైజర్​కు నాలుగైదు పనులు

పనులను పర్యవేక్షించేందుకు సూపర్​వైజర్ల కొరత కూడా ఉంది. ఒక సూపర్​వైజర్​ఏకకాలంలో నాలుగైదు పనులు పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో వారు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. గనులు, ఏరియా స్టోర్స్, లోడింగ్, అన్​లోడింగ్​ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులకు సరైన శిక్షణ కూడా ఇవ్వడంలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విధిగా నిర్వహించాల్సిన సేఫ్టీ సమావేశాలను సింగరేణి యాజమాన్యం నిర్వహించడంలేదు. దీంతో ప్రమాదాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగడంలేదు.

క్వాలిటీ పనిముట్ల కొరత

బొగ్గును వెలికితీయడానికి వినియోగిస్తున్న పనిముట్లు నాసిరకం కావడంతో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరు నెలలు పాటు మన్నికగా ఉండాల్సిన బూట్లు, హెల్మెంట్లు ఒకటి, రెండు నెలలకే పనికిరాకుండా పోతున్నాయి. బూట్ల కింద భాగం గ్రిప్ ​కోల్పోవడంతో గనుల్లో జారిపడిపోతున్నట్లు కార్మికులు చెప్తున్నారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా వినియోగిస్తున్న సైడ్ ​డిస్​చార్జి లోడర్​(ఎస్​డీఎల్) యంత్రాలు కాలం చెల్లినవని ఆరోపణలున్నాయి.

వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కాసిపేట2 గని కార్మికులు ఆందోళనకు సైతం దిగారు. తాము గనిలోకి వెళ్లేందుకు మ్యాన్ ​రైడింగ్​సిస్టం అందుబాటులో లేదని, కనీసం నడిచే మెట్లు కూడా సరిగ్గాలేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గనుల్లో వాడే రూఫ్ ​బోల్టులు సైతం నాసిరకంగా ఉంటున్నాయి.