12 నిమిషాల తేడాతో రెండు భూ కంపాలు : బ్యాంకాక్ లో మెట్రో రైలు ఎలా ఊగిపోయిందో చూడండీ..!

12 నిమిషాల తేడాతో రెండు భూ కంపాలు : బ్యాంకాక్ లో మెట్రో రైలు ఎలా ఊగిపోయిందో చూడండీ..!

నైపిడా: వరుస భూకంపాలు మయన్మార్ దేశాన్ని గడగడలాడిస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో వెనువెంటనే భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం (మార్చి 27) మధ్నాహ్నం 12.50 గంటలకు రిక్టర్ స్కేల్‎పై 7.7 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించగా.. 12  నిమిషాల వ్యవధిలోనే అంటే 1.02 నిమిషాలకు మరో భూకంపం వచ్చింది. రెండోసారి వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై  8.7గా నమోదైంది. ఈ భూకంపం 61 కి.మీ (38 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. ఫస్ట్ టైమ్ వచ్చిన భూకంపానికే మయన్మార్ అతాలకుతలం కాగా.. రెండోసారి అంతకుమించిన పవర్ ఫుల్ భూకంపం సంభవించింది. 

మయన్మార్‎లోని సాగింగ్, మండలే, క్యూక్సే, పైన్ ఊ ల్విన్, ష్వెబోతో సహా అనేక పట్టణాల్లో భూ ప్రకంపనలు గడగడలాడించాయి. భూకంపక ధాటికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు, వంతెనలు నేలమట్టం అయ్యాయి. భూప్రకంపనలకు మయన్మార్ లోని ఎత్తైన భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అతి శక్తివంతంమైన భూకంపం సంభవించడంతో మయన్మార్ చిగురుటాకులా వణికిపోతుంది. 

Also Read : ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి

భూకంపధాటికి మండలేలోని చారిత్రాత్మక మండలే ప్యాలెస్ తీవ్రంగా దెబ్బతిన్నది. అలాగే.. సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్‌షిప్‌లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. క్యూక్సే, పైన్ ఊ ల్విన్, ష్వెబో వంటి ఇతర సమీప పట్టణాలు కూడా భూకంప ధాటికి వణికిపోయాయి. మయన్మార్‎లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

ఈ వీడియోల్లో ఎత్తైన భవనాలు, బ్రిడ్జిలు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోవడం కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపై పరుగులు పెడుతోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన లెక్కలపై మయన్మార్ ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే.. భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

థాయ్‌లాండ్‎లోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం మయన్మార్‎లోని మండలే పట్టణం కేంద్రంగా భూమికి 10 కిలో మీటర్ల లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ నివేదించింది. భూ ప్రకంపనల ధాటికి థాయ్‌లాండ్‎లోని పలు ప్రాంతాలు వణిపోయాయి. ముఖ్యంగా థాయ్‌లాండ్‎ రాజధాని బ్యాంకాక్ భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైంది. 

బ్యాంకాక్‎లోని పలు ఏరియాల్లో పెద్ద ఎత్తున భూప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల ధాటికి మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. ఎత్తైన భవనాలు సైతం నిమిషాల్లోనే కుప్పకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. బ్యాంకాక్ లో భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒక వీడియోలో భూకంపధాటికి మెట్రో రైలు ఊగిపోతున్నా దృశ్యాలు కనిపించాయి.