- గద్వాల ప్రజలను భయపెడుతున్న దొంగలు
- ఈ నెలలో ఇప్పటికే ఎనిమిది దొంగతనాలు
- కేసుల పరిష్కారంలో
- ప్రోగ్రెస్ చూపని పోలీసులు
- పెట్రోలింగ్ కూడా చేయకపోవడంపై విమర్శలు
గద్వాల, వెలుగు: గద్వాల పట్టణ ప్రజలను వరుస దొంగతనాలు భయపెడుతున్నాయి. దొంగలు పగలురాత్రి తేడా లేకుండా చోరీలు చేస్తుండడంతో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఎనిమిది దొంగతనాలు జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ‘ప్రజల భద్రత– భరోసా మాది’ అని చెప్పుకునే డిపార్ట్‌మెంట్ కేసుల ఛేదనలో పురోగతి చూపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాత్రివేళల్లో అన్ని ఏరియాల్లో పెట్రోలింగ్ చేయడం లేదని, సీసీ కెమెరాలు ఉన్నా వాడుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరుస దొంగతనాలు
జనవరి 6న గద్వాల టౌన్‌లోని సెకండ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి దొంగలు రెండున్నర తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. జనవరి 7న ఇదే కాలనీలో జాడే అరుణ్ కుమార్ ఇంట్లో ఏడు తులాల గోల్డ్, మూడు కేజీల వెండి, 25 వేల క్యాష్ దొంగిలించారు. మరో ఇంట్లో 4 తులాల గోల్డ్, 22 వేల క్యాష్ మాయం చేశారు. 14న గద్వాల–ఎర్రవెల్లి రోడ్డుమీద బైక్‌పై వెళ్తున్న గొల్ల కృష్ణయ్యను ఆపి పోలీసులమని చెప్పి పట్టపగలే అతని చేతికున్న గోల్డ్ రింగ్ గుంజుకున్నారు. 18న భీమ్ నగర్ కాలనీలో అక్తర్ ఇంటిలో రూ. లక్ష విలువైన సౌదీ కరెన్సీతో పాటు రూ.12 వేలను ఎత్తుకెళ్లారు. అదే రోజు సేమ్ కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయి పద్మా రెడ్డి ఇంట్లో దొంగతనానికి యత్నించి విఫలమయ్యారు. అలంపూర్ చౌరస్తాలోని మొబైల్ షాప్, కూల్ డ్రింక్ షాప్‌తో పాటు రెండు ఫర్టిలైజర్స్ దుకాణాల్లో దొంగతనం చేశారు.
ఫైన్లపై ఉన్న ధ్యాస గస్తీపై లేదు.
పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదంటూ వాహనదార్లకు ఫైన్లు వేయడంలో పెడుతున్న శ్రద్ధ గస్తీపై పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. గద్వాల టౌన్‌లో గతంలో 33 వార్డులుంటే ప్రస్తుతం 37 వార్డులున్నాయి. 80 వేల జనాభా ఉండగా.. రెండు పీఎస్‌లు మాత్రమే ఉన్నాయి. ఇదివరకు 8 బీట్లలో పెట్రోలింగ్ చేసే పోలీసులు ప్రస్తుతం రెండు బీట్లకు మాత్రమే వెళ్తున్నారు. ఓ మూలకు వెళ్తే మరొక మూలకు వెళ్లడానికి వారం రోజుల సమయం పడుతుందని కొందరు సిబ్బంది అంటున్నారు. కొన్నిరోజులుగా పెట్రోలింగ్ కూడా చేయడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.
కేసుల ఛేదన ఏది?
కేసుల ఛేదనలో పోలీసులు వెనుకబడుతున్నారు. ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఛేదించలేదు. దీంతో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. రాత్రి వేళ్లలో ఇండ్ల చోరీతో పాటు పగటి పూట పిక్‌పాకెటింగ్, చైన్‌స్నాచింగ్ చేస్తున్నారు. పట్టణంలో అన్ని కూడళ్లలో సీసీ కెమెరాలు ఉన్నా కేసుల్లో పురోగతి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఎంక్వైరీని సీరియస్‌గా తీసుకోవడం లేదని, చోరీలు జరుగుతున్నా పెట్రోలింగ్ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిఘా పెంచినం
దొంగతనాలు జరగకుండా నిఘా పెంచినం. సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్స్ రాత్రిపగలు డ్యూటీ చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాల ద్వారా సమాచారం సేకరించినం. గద్వాల పట్టణంలో నాలుగు బీట్లలో నిఘాను పెంచినం. త్వరలో దొంగలను పట్టుకుంటం. - రంగస్వామి, డీఎస్పీ, గద్వాల