హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరా కాలనీ రోడ్డు నెంబర్14లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో రేవంత్ ఆనంద్ (57) పై కాల్పులు ఆమె కూతురి లవర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
సరూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట్కి చెందిన బల్విందర్ సింగ్ (25), మన్వీత (23) అనే యువకుడు, యువతి కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీళ్ల ప్రేమకు అమ్మాయి తండ్రి రేవంత్ ఆనంద్ అభ్యంతరం తెలిపాడు.
బల్విందర్ సింగ్‌ను తన కూతురు ప్రేమించడం ఇష్టం లేని ఆమె తండ్రి ఆ అమ్మాయిని ఈ మధ్యనే ఎవ్వరికి తెలియకుండా అమెరికాకు పంపించేశాడు. తన ప్రేయసిని తనకు దూరం చేసినందుకు బల్విందర్ సింగ్ కోపంతో రగిలిపోయాడు. ఆమెను అమెరికాకు పంపించిన విషయం తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ప్రేమ జంటను విడదీశాడని యువతి తండ్రిపై పగతో రగిలిపోయాడు.
బల్విందర్ సింగ్ ఈ విషయంలో అమ్మాయి తండ్రి రేవంత్ ఆనంద్‌తో ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. కోపం కట్టలు తెంచుకోవడంతో తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
నిందితుడు బల్విందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి అమెరికాలో ఉంది. పోలీసుల విచారణలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలిసింది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం అని విచారణలో తేలింది. అమ్మాయి తండ్రిపై మొదట రాయితో కొట్టి బొమ్మ పిస్తోల్‌తో భయపెట్టాడని పోలీసులు చెప్తున్నారు.