ఖమ్మంలో బీఆర్ఎస్ లీడర్ల బల ప్రదర్శన

  • వేలాది మందితో పొంగులేటి, తుమ్మల ఆత్మీయ సమ్మేళనాలు ..హైకమాండ్​ను టార్గెట్ చేస్తూ కామెంట్లు
  • ‘వాడ వాడ పువ్వాడ’ ప్రోగ్రామ్​ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్​
  • బీఆర్ఎస్​లో మనకు దక్కిన గౌరవమేంటో ఆలోచించాలె: పొంగులేటి 
  • దుమ్ముగూడెం ప్రాజెక్టుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం: తుమ్మల 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్​కు చెందిన ముగ్గురు ముఖ్య నేతల కామెంట్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం ఖమ్మంలో ‘వాడ వాడ పువ్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ప్రత్యర్థులపై సంచలన కామెంట్లు చేశారు. అందరూ ఒక్కటై తనను దెబ్బతీసే కుట్ర చేశారని, కానీ తాను తిప్పికొట్టానని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్​లో నాలుగేండ్లుగా ఏ పదవీ లేకుండా అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేలాది మంది కార్యకర్తలతో ఆదివారం తమ ఇండ్ల వద్ద ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి పార్టీ హైకమాండ్​ను టార్గెట్​చేస్తూ మాట్లాడారు. 

గడిచిన నాలుగున్నరేండ్లలో బీఆర్ఎస్ లో మనకు దక్కిన గౌరవం ఏమిటో అందరికీ తెలుసంటూ పొంగులేటి అనగా.. దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని తుమ్మల అన్నారు. వీళ్లిద్దరూ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా హైకమాండ్​పై కామెంట్లు చేయడం హాట్​టాపిక్​గా మారింది. 

మళ్లీ కుట్రలు జరుగుతయ్: పువ్వాడ 

‘‘వాడ వాడ పువ్వాడ’’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 27, 17 డివిజన్లలో మంత్రి అజయ్ పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్​మీటింగ్ లో మాట్లాడారు. ‘‘గతంలో నన్ను దెబ్బకొట్టడం కోసం, నా మీద డైరెక్ట్ గా ఆరోపణలు చేయలేక కార్పొరేటర్ల మీద తప్పుడు ప్రచారం చేసి నాకు నష్టం చేయాలని కుట్ర చేశారు. కానీ ప్రజలు నాకు అండగా నిలిచి నన్ను గెలిపించారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు, కుట్రలు జరుగుతాయి. కానీ డబ్బుతోనే అన్నీ కావు. క్యారెక్టర్​ అవసరం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినప్పుడు కొన్ని విలువలు చాలా అవసరం. ఆ విలువలకు కట్టుబడి, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుకు పోతున్నా” అని ఆయన అన్నారు. 

గోదారి నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతా: తుమ్మల 

పాలేరు నియోజకవర్గ పరిధిలోని బారుగూడెంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి పాలేరు, ఖమ్మంతో పాటు సత్తుపల్లి నుంచి ఆయన అభిమానులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. ఈ  సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. ‘‘40 ఏండ్ల రాజకీయ జీవితం నాకు సంతృప్తినిచ్చింది. జిల్లా ప్రజల మద్దతు వల్లే ముగ్గురు సీఎంల హయాంలో నాకు మంత్రి పదవులు దక్కాయి. సీఎంల సపోర్టు వల్లే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రూ.వేల కోట్లు తీసుకువచ్చాను. 

నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రారంభించిన దుమ్ముగూడెం ప్రాజెక్టును ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి” అంటూ పరోక్షంగా బీఆర్ఎస్​ను విమర్శించారు. త్వరలోనే దుమ్ముగూడెం నిర్మాణం పూర్తి చేసి, ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తన ఏకైక కోరిక అని చెప్పారు. ‘‘ఇప్పటికే సీఎం కేసీఆర్​ను రిక్వెస్ట్ చేసి, ఆయన చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించాను. ఏనాటికైనా గోదావరి నీళ్లతో పాలేరు ప్రజల పాదాలు కడగాలన్నదే నా ముందున్న లక్ష్యం. అది నెరవేరాలని భద్రాచలం శ్రీరామచంద్రస్వామిని వేడుకుంటున్నాను” అని చెప్పారు. కాగా, భవిష్యత్ రాజకీయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబివ్వకుండా వెళ్లిపోయారు. 

టైమొచ్చినప్పుడు అన్నీ చెప్తా: పొంగులేటి 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోని తన నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి సంచలన కామెంట్లు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను, తన అనుచరులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘‘గడిచిన నాలుగున్నరేండ్లలో ఏమి ఇబ్బంది జరిగింది? ఎందుకు జరిగింది? అనేది మనకు తెలియంది కాదు. ఈనాడు మనం బీఆర్ఎస్ లో ఉన్నాం. కానీ ఈ పార్టీలో మనకు దక్కిన గౌరవం ఏంటి, భవిష్యత్తులో దక్కే గౌరవం ఏంటి? అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. 

ఒక్కటైతే కచ్చితంగా చెబుతున్నాను.. ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల ముఖ్య నాయకులు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు. ఇది రాజకీయ వేదిక కాదు.. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతో చర్చిస్తా. తప్పకుండా మీ దీవెనలతో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నాను” అంటూ ఆయన ప్రసంగం ముగించారు.