రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముడు గుర్తొస్తారు. ఎన్ని గొడవలు పడ్డా..ఎక్కడున్నా ఆ రోజు సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుతారు. కష్టాలు వచ్చినా..కన్నీళ్లు వచ్చినా ప్రాణాలున్నంత వరకు ఒకరినొకరు అండగా ఉంటామని చెప్పుకుంటారు. అది రక్తసంబంధానికి ఉన్న విలువ. అయితే కాసేపట్లోనే చనిపోతానని తెలిసిన ఓ సోదరి ఆస్పత్రిలోనే తన సోదరులకు రాఖీ కట్టి తుది శ్వాస విడిచింది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలో జరిగింది.
తాను బతుకుతానో లేదోనని చివరి సారిగా తన అన్న,తమ్ముడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటల్లోనే తుది శ్వాస విడిచింది. ఆస్పత్రి బెడ్ పై నుంచే రాఖీ కట్టిన ఈ వీడియో చూస్తే అందరినీ కలిచివేస్తోంది. చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఓ సోదరి కోదాడలోని ఓ కళాశాలలో పాల్ టెక్నిక్ చదువుతోంది. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి నిత్యం వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బందువులు చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే రాఖీ పండుగ వరకు బతుకుతానో లేదోనని శనివారం(ఆగస్టు 17న) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక.. తన అన్నదమ్ముళ్లను పిలిచి బెడ్ పై నుంచే రాఖీ కట్టింది. తర్వాత కొన్ని గంటలకే తుది శ్వాస విడిచింది. నర్సింహుల పేట పోలీసులు ఆ ఆకతాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.