ఆరేండ్ల చిన్నారిపై రేప్.. మర్డర్

ఆరేండ్ల చిన్నారిపై రేప్.. మర్డర్
  •     పెద్దపల్లి జిల్లాలో దారుణం
  •     ఆరుబయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ ​అఘాయిత్యం
  •     సీసీటీవీలో కిడ్నాప్​ దృశ్యాలు.. నిందితుడి అరెస్టు
  •     పోక్సో చట్టం కింద కేసు పెట్టండి: సీఎం రేవంత్​
  •     బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ

సుల్తానాబాద్, వెలుగు : ఆరేండ్ల బాలికను కిడ్నాప్ ​చేసి అత్యాచారానికి పాల్పడి చంపేశాడో దుర్మార్గుడు. గురువారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కాట్నపల్లి శివారులోని రైస్ మిల్లులో వారం కింద పనిలో చేరింది. గురువారం రాత్రి భారీ వర్షం వచ్చి తగ్గిన తర్వాత రూమ్​లో ఉక్క పోయడంతో ఆ కుటుంబం మిల్లు ఆవరణలో ఆరుబయట పడుకుంది. 

సుల్తానాబాద్, వెలుగు : ఆరేండ్ల బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారానికి పాల్పడి చంపేశాడో దుర్మార్గుడు. గురువారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కాట్నపల్లి శివారులోని రైస్ మిల్లులో వారం కింద పనిలో చేరింది. గురువారం రాత్రి భారీ వర్షం వచ్చి తగ్గిన తర్వాత రూమ్​లో ఉక్క పోయడంతో ఆ కుటుంబం మిల్లు ఆవరణలో ఆరు బయట పడుకుంది. 

వారు నిద్రపోవడం గమనించిన పక్క మిల్లులో డ్రైవర్​గా పని చేసే బిహార్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాకు చెందిన వినోద్ మాఝి అనే వ్యక్తి అందులో ఆరేండ్ల పాపను కిడ్నాప్ చేశాడు. మిల్లు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చాడు. పాప కనపడటం లేదని తల్లిదండ్రులు తోటి కార్మికులతో కలిసి గాలించగా గడ్డి పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. వినోద్ మాఝి బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కార్మికులు, బాలిక తల్లిదండ్రులు నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి డీసీపీ డాక్టర్ చేతన, ఏసీపీ జి.కృష్ణ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజీవ్ ​రహదారిపై రాస్తారోకో 

అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో చాలాసేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మిల్లులో సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని రాస్తారోకోలో పాల్గొన్న వివిధ పక్షాల నాయకులు ఆరోపించారు. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తం: సీఎం

పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఆరేండ్ల చిన్నారిపై జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘నాగరిక సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు మానవత్వానికే సిగ్గుచేటు. పసి బిడ్డల ప్రాణం తీసే ఉన్మాద ఆలోచనలకు మన సమాజంలో చోటు లేదు. ఈ దారుణానికి పాల్పడిన మానవమృగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. సాధ్యమైనంత వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, దుర్మార్గుడికి కఠినమైన శిక్షపడేలా చూడాలని పోలీసులను కోరుతున్నాను. చిన్నారి తల్లిదండ్రులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన తెలిపారు.

బాలికపై అత్యాచారం

అశ్వాపురం, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బాలికపై గురువారం రాత్రి అత్యాచారం జరిగింది. ఆడుకుంటున్న బాలికను పక్కింటి వ్యక్తి గాడిద శ్రీనివాసరావు(40) డాబా పైకి తీసుకువెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు డాబా పైకి వెళ్లి చూడగా, నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని  డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించారు.