జగిత్యాల ప్రజావాణిలో ఆరో తరగతి స్టూడెంట్ కంప్లయింట్
జగిత్యాల రూరల్, వెలుగు : తమ స్కూల్లో టాయిలెట్స్సమస్యను పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విశ్వాంక్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌కు వెళ్లి కంప్లయింట్ చేశాడు. ఓల్డ్ హైస్కూల్లో 360 మంది స్టూడెంట్స్ ఉండగా, వీరి కోసం ఎప్పుడో నిర్మించిన టాయిలెట్స్శిథిలావస్థకు చేరుకున్నాయి.
ప్రభుత్వం ఈ మధ్యనే గర్ల్స్, బాయ్స్ కోసం ఒక్కో టాయిలెట్ కట్టినా 360 మందికి సరిపోవడం లేదు. స్కావెంజర్లు కూడా లేకపోవడంతో కంపు కొడుతున్నాయి. దీంతో స్టూడెంట్లు అందులోకి వెళ్లడం లేదు. ‘మన ఊరు- మన బడి’ పథకం కింద మరో ఆరు యూనిట్లు మంజూరైనా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. విశ్వాంక్ ఫిర్యాదును తీసుకున్న అధికారులు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.