తల్లిని వదిలి హాస్టల్‌కు వెళ్లలేకనే కిడ్నాప్​ డ్రామా

  • బస్సు, ఆటో ఎక్కి వరంగల్​కు... 
  • పిల్లాడికి తాడు ఇచ్చి కట్టమన్న సాగర్
  • ​ఇంటికి వచ్చాక స్టోరీ చెప్పిండు
  • రేగొండలో బాలుడి కిడ్నాప్ మిస్టరీ ఛేదించిన పోలీసులు

రేగొండ, వెలుగు:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బాలుడి కిడ్నాప్​ వ్యవహారం అంతా డ్రామా అని పోలీసులు తేల్చారు. తల్లిని వదిలి హాస్టల్​కు వెళ్లకుండా ఉండేందుకు చెప్పిన కట్టుకథ అని ఎస్సై ననగంటి శ్రీకాంత్​రెడ్డి స్పష్టం చేశారు. రేగొండకు చెందిన కొలెపాక ప్రేమ్​సాగర్​సోమవారం ఉదయం పోలీస్​స్టేషన్​ పక్కన టిఫిన్ ​చేస్తుండగా కొంతమంది తనను కిడ్నాప్​ చేశారని, ఓమ్ని వ్యాన్​లో తీసుకువెళ్లి వరంగల్​లో వదిలేశారని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ములుగు జిల్లా జాకారంలోని సోషల్​ వెల్ఫేర్​హాస్టల్​లో 6వతరగతి చదువుతున్న ప్రేమ్​సాగర్​..నెల రోజుల కింద ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లి హాస్టల్​కు వెళ్లాలనడంతో తప్పించుకోవడానికే డ్రామా ఆడాడు.  

తల్లిని వదిలి హాస్టల్‌కు​ వెళ్లలేక..

బాలుడి తల్లి సునంద కూలి పని చేస్తుంటుంది. తండ్రి లేకపోవడంతో సాగర్​ను జాకారంలోని హాస్టల్​లో జాయిన్​ చేసింది. సోమవారం హాస్టల్ ​వెళ్లాలని, టిఫిన్​ చేసి రమ్మని రూ.50 ఇచ్చింది. పోలీస్​స్టేషన్​ వరకు నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి పరకాల వెళ్లాడు. సాగర్​తో పాటు వెంకటేశ్వర్లపల్లి కి చెందిన ఐటీఐ స్టూడెంట్ రవి తేజ కూడా బస్​ఎక్కాడు. ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావ్​ అని అడగ్గా..‘పరకాల హాస్పిటల్ లో తాతయ్య ఉన్నడు. అమ్మ కూడా అక్కడ్నే ఉంది. అక్కడికే వెళ్తున్నా’ అని చెప్పాడు. పరకాల నుంచి ఆటోలో వరంగల్ లోని మట్టెవాడ వెళ్లాడు. అక్క ఇంటికి వెళ్దామనుకున్నా..అడ్రస్​ మర్చిపోవడంతో కొత్త కథ సృష్టించాడు. ఓ షాపులో కొబ్బరి తాడు తీసుకుని అటుగా వెళ్తున్న స్కూల్​ పిల్లాడికి ఇచ్చి చేతులు వెనక్కి పెట్టి కట్టించుకున్నాడు. తర్వాత ఏడ్వడం మొదలుపెట్టాడు. ఓ వ్యక్తి బాలుడిని చూసి వివరాలు కనుక్కుని తల్లికి ఫోన్​చేసి చెప్పాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కిడ్నాప్​ కథ చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కిడ్నాప్​ జరిగిందన్న చోట సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు.  అందులో పిల్లవాడు బస్కెక్కేది రికార్డయ్యింది. ఆ టైంకు ఒక్క ఓమ్నీ వ్యాన్​ కూడా రాలేదు. ఎస్ఐ శ్రీకాంత్​...సాగర్​ను హన్మకొండకు తీసుకుని వెళ్లి ఎంక్వైరీ కూడా చేశాడు. దీంతో అన్నీ అబద్దాలే అని తేలాయి​.