పెద్దమనుషులు ఫైన్ వేశారని మహిళ ఆత్మహత్య

పెద్దమనుషులు పంచాయతీ చేసి జరిమాన విధించారని మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తేజావత్ కవిత, ఆమె తమ్ముడు హోలీ రోజున గొడవపడ్డారు. ఈ గొడవలో మాలోతు ప్యాంటీ అనే మహిళా తల దూర్చింది. కవిత, ప్యాంటీ మధ్యన స్వల్ప ఘర్షణ జరగడంతో ప్యాంటి చేతివేళ్ళకు బలమైన గాయమైంది. అనంతరం ప్యాంటీ కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఆ గ్రామ పెద్ద ఆంగోత్  శ్రీరామ్ ను ఆశ్రయించి తనకు కవిత ద్వారా నష్టపరిహారం చెల్లించేలా  చూడాలని వేడుకుంది. ఈనెల 12వ తేదీన పంచాయతీ జరగగా... పెద్ద మనుషులు మాట్లాడి ప్యాంటీకి కవిత రూ.60 వేల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్లో తనపై కేసు, మరోవైపు గాయపడిన ప్యాంటీ డబ్బుల డిమాండ్ తో కవిత మనస్థాపానికి గురైంది.

ఆ భయంతో ఆరో జు సాయంత్రమే కవిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, దుబ్బ తండాలోని బొడ్రాయి వద్ద స్పృహ కోల్పోయి పడిపోయింది. కవితను వెంటనే  ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మార్చి 14న మృతి చెందింది. ఆ తర్వాత ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు మృతికి కారకులైన ప్యాంటీ, గ్రామ పెద్దమనిషి అంగోత్  శ్రీ రామ్ పై కేసు నమోదైంది. కవిత మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి, ఆమె కుటుంబానికి న్యాయం చెయ్యాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.