దక్షిణ సూడాన్లో పెను విషాదం.. కుప్పకూలిన విమానం.. 20 మంది మృతి

దక్షిణ సూడాన్లో పెను విషాదం.. కుప్పకూలిన విమానం.. 20 మంది మృతి

సూడాన్: దక్షిణ సూడాన్ లో విషాద ఘటన జరిగింది. టేకాఫ్ సమయంలో విమానాశ్రయానికి 500 మీటర్ల దూరంలో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నారు. మొత్తం ఈ చిన్న విమానంలో 21 మంది ఉన్నట్లు తెలిసింది. ఇందులో.. ఇద్దరు పైలట్లు కాగా, 16 మంది దక్షిణ సూడాన్ వాసులు, ఇద్దరు చైనా దేశస్తులు, ఒక భారతీయుడు ఉన్నారు. 21 మందిలో ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. గాయపడిన అతనిని బెంటియు స్టేట్ హాస్పిటల్కు తరలించారు.

విమానంలోని వారంతా GPOC (Greater Pioneer Operating Company) ఉద్యోగులుగా తెలిసింది. ఉద్యోగులను యునిటీ స్టేట్ నుంచి దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు తరలిస్తుండగా ఈ ఘోరం జరిగింది. యునిటీ ఆయిల్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్లో భారత కాలమానం ప్రకారం జనవరి 29, 2025 ఉదయం 10.30 గంటల సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

2024 డిసెంబర్ 29న సౌత్ కొరియాలోని ముయాన్‌‌ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జేజు ఎయిర్ లైన్స్​కు చెందిన ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతూ.. రన్ వే నుంచి అదుపు తప్పి సేఫ్టీ వాల్​ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆపై విమానం పేలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ల్యాండింగ్ గేర్లో తలెత్తిన సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ విమానంలో 181 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 179 మంది చనిపోగా.. ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. జేజు ఎయిర్ లైన్స్కు చెందిన 7సీ2216 నంబర్ ఈ బోయింగ్ విమానం.. బ్యాంకాక్ నుంచి సియోల్ కు వచ్చింది. ముయాన్ ఎయిర్​పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. డిసెంబర్ 29, 2024 (ఆదివారం ఉదయం) 9.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.