‘బెంగళూరు మాది మాత్రమే’.. ఒక్క వార్నింగ్తో సోషల్ మీడియా అల్లకల్లోలం

‘బెంగళూరు మాది మాత్రమే’.. ఒక్క వార్నింగ్తో సోషల్ మీడియా అల్లకల్లోలం

ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ‘ఎక్స్’లో ఒక కన్నడ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘ఎక్స్’లో అభిప్రాయ వ్యక్తీకరణ సర్వ సాధారణం. కానీ.. ఆ అభిప్రాయ వ్యక్తీకరణ వివాదాస్పదంగా ఉన్నప్పుడు వ్యతిరేకత వ్యక్తమై దుమారం రేగుతుంది. ఈ యువకుడి పోస్ట్ విషయంలో కూడా అదే జరిగింది. ‘‘బెంగళూరుకు వస్తున్న ప్రతీ ఒక్కరికీ ఒక విషయం స్పష్టం చేస్తున్నాం..బెంగళూరు నగరంలో ఉంటూ కన్నడ మాట్లాడని వారిని, కన్నడ నేర్చుకునే ప్రయత్నం చేయని వారిని బయటవారిగానే చూస్తాం.. గుర్తుపెట్టుకోండి. అందరికీ షేర్ చేయండి. మేం జోక్ చేయడం లేదు.  బెంగళూరు కన్నడిగులది మాత్రమే’’.

 

ఇదీ ఆ యువకుడు ‘ఎక్స్’లో చేసిన హెచ్చరిక. పట్టుమని వెయ్యి మంది ఫాలోవర్స్ కూడా లేని ఈ యువకుడు చేసిన ఈ పోస్ట్కు ఏకంగా 5.5 మిలియన్ వ్యూస్తో పాటు 6 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయంటే ఎంతలా ఈ పోస్ట్ వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. మంజు అనే యువకుడు చేసిన ఈ పోస్ట్పై ‘ఎక్స్’లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కన్నడిగులు ఈ యువకుడి పోస్ట్ను సమర్థించగా, మెజారిటీ సోషల్ మీడియా యూజర్లు ఈ యువకుడి వైఖరిని తూర్పారబట్టారు. ఈ పోస్ట్పై ‘ఎక్స్’ యూజర్లలో ఒకరు స్పందిస్తూ.. 8 ఏళ్ల నుంచి బెంగళూరులో ఉంటున్నానని, తనకు కన్నడ నేర్చుకోవడం కష్టంగా అనిపించిందని చెప్పారు. అయినా సరే కన్నడ భాష అంతగా రాని తనను బయటవ్యక్తిగా ఎవరూ చూడలేదని, బెంగళూరులో ఉన్న కన్నడిగులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గౌరవంగానే చూస్తున్నారని తెలిపారు. ఈ యువకుడు ప్రొజెక్ట్ చేస్తున్నంత దారుణంగా కన్నడిగులు లేరని చెప్పారు. ఇంట్లో నుంచి బయటికొచ్చి బయట ప్రపంచాన్ని బహుశా ఈ యువకుడు చూడకపోవడం వల్లే అతనికి ఇలాంటి దారుణమైన ఆలోచనలు వచ్చి ఉండొచ్చని సదరు సోషల్ మీడియా యూజర్ ఈ యువకుడిపై జాలి పడటం గమనార్హం.