- రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
గచ్చిబౌలి, వెలుగు: రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్గం చెరువులో శవమై తేలాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌లో నివాసం ఉండే బాలాజీ (25) రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఆఫీస్‌కు వచ్చిన బాలాజీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్‌ను అడిగినా బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో గురువారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆఫీస్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, 24వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఆఫీస్ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఆఫీస్ నుంచి నేరుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే, శుక్రవారం ఉదయం దుర్గం చెరువులో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు మృతి చెందిన వ్యక్తి వద్ద లభించిన ఐడీ కార్డు ఆధారంగా అతన్ని బాలాజీగా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన బాలాజీ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, సూసైడ్‌కు కారణాలు తెలియరాలేదని చెప్పారు.
కేపీహెచ్‌బీలో మరొకరు..
కూకట్‌పల్లి: కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా కలపనాయుడుపల్లికి చెందిన హేమనందిని (27)కి, ఈ ఏడాది మార్చిలో శ్రీధర్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు కేపీహెచ్‌బీ కాలనీ ఏడో ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఆషాఢ మాసం కావడంతో శ్రీధర్ ఈ నెల 1న తన సొంతూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో కేపీహెచ్‌బీలోని ఇంట్లో హేమనందినితో పాటు ఆమె సోదరుడు హరిబాబు, గ్రాండ్ మదర్ ఉంటున్నారు. 24వ తేదీ రాత్రి 11.40 గంటల సమయంలో హేమనందిని హెయిర్ ఆయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే హేమనందిని ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.